calender_icon.png 20 August, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖనిజాల అన్వేషణపై ప్రత్యేక దృష్టి

13-08-2024 01:16:19 AM

  1. పురోగతి సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు 
  2. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి) : దేశంలో ఖనిజాల వెలికితీతకు సంబంధించి భవిష్యత్‌లో మరింత ముందడుగు వేయబోతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టంచేశారు. సోమవారం ఢిల్లీలోని అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన 6వ ఎన్‌ఎంఈటీ (నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్) గవర్నింగ్ బాడీ సమావేశంలో ఎక్స్-అఫిషియో చైర్మన్ హో దాలో ప్రసంగించారు. దేశంలో ఖనిజ సంపదకు లోటులేదని, అయితే అనుకున్నంతగా ఆ సామర్థ్యాన్ని అందిపుచ్చుకోలేదని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని 2015లో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఎన్‌ఎంఈటీని స్థాపించినట్లు తెలిపారు.

ఈ సంస్థ ద్వారా ఖనిజాల అన్వేషణతోపాటు వెలికితీతలో ఏటా పురోగతి సాధిస్తున్నామన్నారు. రాష్ట్రా లు ఎన్‌ఎంఈటీ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తులో ఖనిజాల వెలికతీతను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామన్నారు. ఈ రంగంలో సాంకేతికతకు పెద్దపీట వేస్తామని స్పష్టంచేశారు. ఖనిజాల వెలికతీతలో పనిచేసే సంస్థలకు కేంద్ర, రాష్ర్ట ప్రభు త్వాల ద్వారా సంపూర్ణ సహకారం అందించేందుకు కృషిచేస్తామన్నారు.

అన్ని రాష్ట్రా లను కలుపుకొని ముందుకెళ్తామన్నారు. ఎన్జీడీఆర్ (నేషనల్ జియోసైన్స్ డాటా రిపాజిటరీ) పోర్టల్ ద్వారా ఎక్స్‌ప్లొరేషన్‌లో సాధించిన పురోగతిని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కేంద్ర అటామిక్ ఎనర్జీ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ దూబే మాట్లాడుతూ.. దేశంలో ఖనిజాల సామర్థ్యాన్ని వెలికితీసేందుకు రాష్ట్రాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, పరస్పర సహకారంతో జాతి నిర్మాణానికి పనిచేద్దామని పిలుపునిచ్చారు.