15-11-2025 12:05:10 AM
జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): గ్రంధాలయాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. శుక్రవారం 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారితో హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను భాగంగా ఈనెల 14వ తేదీ నుండి 19వ తేదీ వరకు వారం రోజులపాటు జిల్లాలో వివిధ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనం, వక్తృత్వ పోటీ, చిత్రలేఖనం, వ్యాసరచన, ధ్యానం, వ్యక్తిత్వ అభివృద్ధి, పాటలు, రంగోలి, మెహందీ వంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని అన్ని హంగులతో పూర్తి సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉంచడం జరిగిందని, చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి.
అభ్యాసకులు గ్రంథాలయంలో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పాఠకుల కొరకు దినపత్రికలు, వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయం విజ్ఞాన భాండాగారమని, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఈ గ్రంథాలయం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకొని విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి సరిత, లైబ్రేరియన్లు, పాఠకులు తదితరులు పాల్గొన్నారు.