16 June, 2026 | 1:21 AM

బిచ్చగాడుకు పూర్తి భిన్నంగా వంద దేవుళ్లు

16-06-2026 12:11 AM

విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, శక్తి, కావ్య అనిల్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘వంద దేవుళ్ళు’. శశి దర్శకత్వంలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 19న రిలీజ్ కాబోతోంది. సోమవారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నిర్మాత నిహారిక కొణిదెల, దర్శకుడు త్రినాథరావు నక్కిన ముఖ్యఅతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో విజయ్ ఆంటోని మాట్లాడుతూ.. “డైరెక్టర్ శశి కథ చెప్పిన తర్వాత ఎంతో ఏడ్చేశా.

నా పాత్ర చాలా విభిన్నంగా, కొత్తగా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా” అన్నారు. దర్శకుడు శశి మాట్లాడుతూ.. “ఇది ‘బిచ్చగాడు’కి పూర్తి భిన్నంగా ఉంటుంది. అమ్మని దేవతలా చూస్తే అది ‘బిచ్చగాడు’.. అమ్మని సాధారణ మనిషిలా చూస్తే ‘వంద దేవుళ్లు’. ‘బిచ్చగాడు’ ఎంతలా నచ్చిందో.. ‘వంద దేవుళ్ళు’ కూడా అంతే స్థాయిలో నచ్చుతుంది” అని చెప్పారు. ‘ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నా’ని నిర్మాత ఫాతిమా విజయ్ ఆంటోని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో నటి కావ్య అనిల్, డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి, రైటర్ భాష్యశ్రీ, మన్యం రమేశ్, అతిథులు కూడా మాట్లాడారు.