6 August, 2026 | 11:11 PM

బాలల భద్రతపై ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ

06-08-2026 09:53 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి సురక్షితమైన, భయరహితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు చైల్డ్ ప్రొటెక్షన్ పాలసీ తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా బాలల పరిరక్షణ అధికారి (డీసీపీఓ) బోర్ల మహేష్ అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలలో ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో నాలుగో రోజు ఆయన బాలల హక్కులు, పాఠశాలల్లో అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యతలపై అవగాహన కల్పించారు.

పోక్సో చట్టం–2012లోని నిబంధనలు, తప్పనిసరి సమాచార బాధ్యత, బాలల గోప్యత పరిరక్షణ, బాధిత పిల్లల పట్ల సున్నితంగా వ్యవహరించే విధానాలను వివరించారు. బాలలపై ఎలాంటి శారీరక, మానసిక లేదా లైంగిక వేధింపులు జరిగినా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

ప్రతి పాఠశాలలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్‌ను నియమించి, ఫిర్యాదుల స్వీకరణ, నమోదు, పరిష్కారం, అవసరమైతే డీసీపీయూ, చైల్డ్ హెల్ప్‌లైన్–1098, పోలీసు శాఖ, ఎస్‌జేపీయూ, సీడబ్ల్యూసీతో సమన్వయం చేసి పిల్లలకు తక్షణ రక్షణ కల్పించాలని తెలిపారు. పిల్లలతో స్నేహపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యవహరిస్తూ శారీరక శిక్షలు, అవమానకర ప్రవర్తనకు తావు లేకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు.