6 August, 2026 | 10:55 PM

ఉపసర్పంచ్‌ల హక్కుల సాధనకు జయశంకర్ స్ఫూర్తితో ఉద్యమించాలి

06-08-2026 09:35 PM

రూ.5 వేల గౌరవ వేతనం, శిలాఫలకాలపై పేర్లకు ప్రభుత్వం ఆమోదం తెలపాలి: ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్

అచ్చంపేట,(విజయ క్రాంతి): గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉపసర్పంచ్‌లకు తగిన గుర్తింపు, హక్కులు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ఐక్యంగా పోరాడాలని ఉపసర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల కార్తీక్ పిలుపునిచ్చారు. గురువారం అచ్చంపేట పట్టణంలోని శాంసన్ ఫంక్షన్ హాల్‌లో ఉపసర్పంచ్‌ల ఫోరం అచ్చంపేట నియోజకవర్గ అధ్యక్షుడు మాదంశెట్టి తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ఉపసర్పంచ్‌ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

సమావేశానికి ముందు ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బొట్ల కార్తీక్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల అభివృద్ధిలో ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నప్పటికీ, వారికి తగిన గౌరవం, ప్రోత్సాహం లభించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపసర్పంచ్‌లకు నెలకు రూ.5 వేల గౌరవ వేతనం, వార్డు సభ్యులకు రూ.3 వేల గౌరవ వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

గ్రామాల్లో ప్రభుత్వ నిధులతో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాలపై సర్పంచ్‌తో పాటు ఉపసర్పంచ్ పేరు కూడా తప్పనిసరిగా పొందుపరచాలని కోరారు. స్థానిక సంస్థల బలోపేతానికి ఉపసర్పంచ్‌లకు స్పష్టమైన అధికారాలు, గౌరవప్రదమైన గుర్తింపు కల్పించడం అవసరమని పేర్కొన్నారు. హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపసర్పంచ్‌లు ఐక్యంగా పనిచేయాలని, అవసరమైతే ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. 

సమావేశంలో ఉపసర్పంచ్‌ల సమస్యలు, గ్రామ పంచాయతీల్లో ఎదురవుతున్న పరిపాలనా ఇబ్బందులు, స్థానిక సంస్థల బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపసర్పంచ్‌లు తమ సమస్యలను రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ల ఫోరం నాగర్‌కర్నూలు జిల్లా అధ్యక్షుడు వారణాసి శ్రీనివాసులు, వర్కింగ్ ప్రెసిడెంట్ జలీల్, అచ్చంపేట తాలూకా గౌరవ అధ్యక్షుడు వరికుప్పల నిరంజన్, తాలూకా మండల అధ్యక్షులు బొల్లంపల్లి రమేష్, వీరస్వామి, నరసింహ, భాస్కర్తో పాటు అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన ఉపసర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.