1 May, 2026 | 3:45 PM

దురాక్రమణ యుద్ధ భారాలకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కై ఉద్యమిద్దాం

01-05-2026 02:14 PM

తల్లాడ. సత్తుపల్లి(విజయక్రాంతి):140మే డే సందర్బంగా దురాక్రమణ యుద్ధ భారాలకు వ్యతిరేకంగా, నాలుగు లేబర్ కోడ్స్ రద్దు కై ఉద్యమిద్దామని టి యు సి ఐ. ఖమ్మంజిల్లా సహాయ కార్యదర్శి డి శ్రీనివాసరావు జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ లాల్మియా అన్నారు టీ యు సి ఐ ఆధ్వర్యంలో 140 వ మే డే సందర్భంగా స్థానిక రైస్ ఇండస్ట్రీ వద్ద జెండా ఆవిష్కరణ అనంతరం తల్లాడబస్టాండ్ వరకుర్యాలీ నిర్వహించడం జరిగింది ఈసందర్బంగా వారుమాట్లాడుతూ

చికాగో నగరాన చిందిన రక్తం కాల్వలై ప్రవహించే నగరవీధుల్లోన జెండలెరుపెక్కినాయి!  పోరాడ జెండాలే కదిలినాయి.!! అంటూ 8 గంటల పని దినం అమలు చేయాలని, పనికి తగిన | ప్రతిఫలం ఇవ్వాలని, పని స్థలాల్లో మెరుగైన పరిస్థితులు కావాలని, పెట్టుబడిదారుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన రోజే మేడే. 1886 సం||లో మే 1న శ్రామిక వర్గ, కార్మిక వర్గ పోరాట దినంగా పాటించాలని నిర్ణయించాయి అని వారన్నారు. కార్మిక నాయకుల త్యాగంతో, రక్త తర్పణతో ఎరుపక్కిన జెండానే సుత్తి కొడవలి జెండా, కార్మిక జెండా. ఆ పోరాట ఫలితమే | ప్రపంచవ్యాప్తంగా నేడు 8 గంటల పని దినం అమలు అవుతున్నది. ఆ పోరాటాన్నీ, అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేడు కార్మిక వర్గంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న పని భారానికి, పని గంటల పెంపుకి, శ్రమ దోపీడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి. భారతదేశంలో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, పరిశ్రమల్లో, షాపింగ్ మాల్స్, స్విగ్గీ, జొమాటోలలో పనిచేస్తున్న ఉద్యోగులకు, ఇతర అన్ని రంగాల్లో పనిచేస్తున్న శ్రమజీవులకు 10 గంటలు పని చేయించుకోవచ్చు అనే సవరణని కేంద్ర ప్రభుత్వం చేసింది. శ్రమ దోపిడీని తీవ్రం చేసింది. వేతనాల్లో తగ్గింపు, ఉద్యోగ భద్రత లేకపోవడం, సామాజిక భద్రత లేని స్థితి ఏర్పడింది. మేడే స్ఫూర్తికి విఘాతం కలుగుతున్నది.

భారతదేశ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తున్నది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు, కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడ్ను తీసుకువచ్చింది. పని గంటల పెంపు, సమ్మె హక్కును కాలరాస్తూ, అతి తక్కువ వేతనాలతో కార్మిక వర్గంతో పని చేయిస్తూ భారతదేశ కార్మిక వర్గాన్ని మరింత శ్రమదోపిడి చేయడానికి లేబర్ కోడ్స్ ద్వారా మార్పులు చేపట్టింది. కార్మికులపైన మరింత పని భారాన్ని పెంచుతూ. ప్రశ్నించే హక్కును, హక్కులకై నినదించే, నిరసనలు తెలిపే హక్కును కాలరాస్తున్నది. మేడే స్ఫూర్తితో కార్మిక వర్గ ఐక్యతను చాటాలి. పోరాట వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి. కార్మిక జెండా ఎర్రజెండా ఔన్నత్యాన్ని చాటాలి, నాలుగు లేబర్ కోట్స్ను రద్దు చేయాలని నినదించాలి. పనికి తగిన ప్రతిఫలం కై పోరాడాలి. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి.

ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టీయుసీఐ) 140వ మేడేను పురస్కరించుకొని భారత కార్మిక వర్గం, తెలంగాణ రాష్ట్రంలోనూ, యుద్ధ భారాలను ఆపాలని పోరాడాలి. ఉద్యోగాల్లో కోత విధిస్తూ, ధరలను విపరీతంగా పెంచుతూ కార్మిక వర్గ బతుకులను అతలాకుతలం చేస్తూ, కుటుంబాలను సంక్షోభంలోకి నెడుతున్న పరిస్థితులపై పోరాడాలని కోరుతున్నది. సామ్రాజ్యవాద యుద్ధోన్మాద చర్యలను, వాటి సంక్షోభాన్ని కార్మిక వర్గంపై రుద్దే దుష్ట ఆలోచనలకు వ్యతిరేకంగా యుద్ధం వద్దు! శాంతి కావాలని కార్మిక వర్గం నినదించాలి. పోరాడాలి. పెట్టుబడిదారీ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా, పని పరిస్థితుల్లో మెరుగుదల, శ్రమకు తగిన ప్రతిఫలంకై, పని గంటల పెంపుకు వ్యతిరేకంగా, 8 గంటల పనిని అమలుచేయాలని మేడే పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని రాష్ట్ర కమిటీ కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నది. వేతనాలు పెరగక, జీతాలు అక్రమ కోతల వల్ల వచ్చే వేతనం కుటుంబ పోషణకు సరిపోక కార్మిక వర్గ కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. అధిక ధరలతో కొట్టుమిట్టాడుతున్నారు. కాబట్టి, మేడే పోరాట స్ఫూర్తితో కార్మిక హక్కుల సాధనకై, యుద్ధాలకు వ్యతిరేకంగా, పెరుగుతున్న శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి. ఉద్యోగాల్లో కోతలకు వ్యతిరేకంగా పోరాడాలి. తెలంగాణ రాష్ట్రంలో మేడే స్ఫూర్తిని విస్తృతంగా కార్మిక వర్గంలోకి తీసుకు వెళ్ళాలి. కార్మిక హక్కులను కాపాడుకుందాం. 140వ మే దేను, కార్మిక హక్కులను హరించే 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసే వరకు పోరాడదామని ప్రతిజ్ఞ పూనుదాం అన్నారు.