14 August, 2026 | 1:15 AM

ఎల్‌నినో రైతుల పాలిట శాపమా..?

14-08-2026 12:00 AM
  1. ఇప్పటికే వరినాట్లలో రైతులు బిజీ.. నీటి భరోసాపై మాత్రం అయోమయం 
  2. వరి వద్దు.. ఆరుతడి పంటలే మేలంటున్న మంత్రులు, అధికారులు
  3. పంటవేసిన రైతుల పరిస్థితి ఏమిటి? 
  4. రైతన్నల అడుగులు ఎటువైపు?

వనపర్తి, ఆగస్టు 13 (విజయక్రాంతి): ఒకవైపు వాన కోసం ఎదురుచూపులు.. మరోవైపు అందిన కొద్దిపాటి నీటితో పంటలు కాపాడుకోవాలన్న తపన.. ఇంకోవైపు అధికారులు మాత్రం వరి వద్దు.. ఆరుతడి పంటలు వేసుకోండి అంటున్నారు. దీంతో వనపర్తి, గద్వాల జిల్లాల రైతన్న పరిస్థితి పంట వేయాలా? వద్దా? వేస్తే నీరు వస్తుందా? అన్న అయోమయంలో పడింది.

ప్రస్తుతం పలుచోట్ల రైతులు ఇప్పటికే వరి నాట్లలో బిజీగా ఉన్నారు. కూలీలను పెట్టుకుని నాట్లు వేయిస్తున్నారు. విత్తనాలు, ఎరువులు, దుక్కులు, కూలీల ఖర్చులు పెట్టేశారు. ఇప్పుడు ప్రభుత్వం, అధికారులు ఆరుతడి పంటల వైపు మళ్లాలని సూచిస్తుండటంతో ఇప్పటికే వరి వేసిన రైతుల పరిస్థితి ఏంటి? వారి పెట్టుబడులకు భరోసా ఎవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

నాట్లు ఒకవైపు.. నీటి భయం మరోవైపు 

వానాకాలం ప్రారంభమైనప్పటి నుంచి వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూశారు. ఎక్కడో ఒకచోట వర్షం కురిస్తే తమ ప్రాంతంలోనూ వాన పడుతుందని ఎదురుచూశారు. అందుబాటులో ఉన్న బోర్లు, కాలువలు, ప్రాజెక్టుల నీటిని ఆధారంగా చేసుకుని చాలామంది రైతులు వరి సాగుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే కొందరు రైతులు నాట్లు పూర్తి చేయగా.. మరికొందరు నాట్లు వేస్తున్నారు. ఇంతలో రాబోయే రోజుల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని, నీటి లభ్యతపై అనిశ్చితి ఉందని మంత్రులు, అధికారులు చెబుతుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే అప్పు చేసి పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు వరి వద్దంటున్నారు. మరి మేం ఏం చేయాలి? అన్నది రైతుల ఆవేదన.

వరి వద్దు.. ఆరుతడి వేయండంటున్న మంత్రులు, అధికారులు

ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు అధిక నీటి అవసరం ఉన్న వరి సాగు వైపు వెళ్లకుండా మినుము, వేరుశనగ, ఆయిల్పామ్, కూరగాయలు తదితర ఆరుతడి పంటల వైపు మళ్లాలని మంత్రులు, ఎమ్మెల్యే లు, అధికారులు సూచిస్తున్నారు 

మరి ఇప్పటికే వరి వేసిన రైతుల సంగతేంటి? 

ఇదే ఇప్పుడు అసలు సమస్య. వరి వేయొద్దని చెప్పే సమయానికి ఇప్పటికే నాట్లు వేసిన రైతులు ఎంతమంది? వారికి అవసరమైన నీటిని ఎలా అందిస్తారు? ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గితే పంటలను ఎలా కాపాడాలి? బోర్లను నమ్ముకున్న రైతులకు పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు కూడా స్పష్టమైన కార్యాచరణ అవసరమని రైతులు కోరుతున్నారు.

ఎగువ నుంచి నీరు వస్తేనే..

ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల ఆశలు ప్రధానంగా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటి ప్రవాహంపైనే ఉన్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల జరిగితేనే దిగువ ప్రాంతాలకు మరింత నీరు వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల అధికారులు సమావేశంలో తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల నిలిచిపోయినట్లు అధికారులు వివరించారు. అంటే ఈరోజు కాలువలో నీరు కనిపించిందని రేపటి పంటకు భరోసా ఉందని చెప్పలేని పరిస్థితి ఉంది. 

రైతన్నల అడుగులు ఎటువైపు? 

ఒకవైపు వరి సాగుతో పెట్టుబడి పెట్టిన రైతులు.. మరోవైపు వర్షాలపై అనిశ్చితి.. ఇంకోవైపు ఆరుతడి పంటలు వేయాలన్న ప్రభుత్వ సూచనలతో రైతన్న లు అయోమయంలో పడ్డారు. వరి వేస్తే నీరు దొరుకుతుందా? ఆరుతడి పంట వేస్తే మార్కెట్ భరోసా ఉందా? ఇప్పటికే వరి వేసిన రైతుల పంటను ప్రభుత్వం ఎలా కాపాడుతుంది? ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఎంతకాలం ఉంటుంది?కేఎల్‌ఐ, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుల ద్వారా ప్రత్యామ్నాయ నీటి మార్గాలు ఎంతవరకు ఉపయోగపడతాయి? అనే అంశాలు   రైతన్న ముందు నిలిచిన ప్రశ్నలుగా మిగిలాయి.