తెలంగాణలో మార్పు బీజేపీకే సాధ్యం
- రేవంత్‌రెడ్డిది గారడీల పాలన
- అబద్ధాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది
- అప్పులతో ప్రభుత్వాలు నడపడం సరికాదు
- తెలంగాణకు మోదీ 1.60 లక్షల కోట్లు ఇచ్చారు
- 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం.. తెలంగాణలోనూ విజయం సాధిస్తాం
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
* ప్రాంతీయ పార్టీల బలహీనతలే హస్తం పార్టీ బలం. కాంగ్రెస్‌ను ఒక్కసారి ప్రజలు తిరస్కరిస్తే మళ్లీ ఆ పార్టీని ప్రజలు ఆదరించిన దాఖాలాలు లేవు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
హైదరాబాద్/రంగారెడ్డి, డిసెంబర్ 7(విజయక్రాంతి): అబద్ధాలతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా రేవంత్‌రెడ్డి సర్కార్ అమలు చేయలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు.
రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరును చూశారని.. భవిష్యత్‌లో బీజేపీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే ఈ విషయాన్ని చెప్తున్నాయని స్పష్టంచేశారు. తెలంగాణలో మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ఏడాది పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపేలా బీజేపీ ఆధ్వర్యంలో ‘6 అబద్ధాలు 66 మోసాలు’ పేరుతో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సభకు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న మోసాలను ఎత్తిచూపేందుకు బీజేపీ నడుం బిగించిదన్నారు.
రేవంత్ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తోన్న పోరాటాన్ని అభినందించారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
రైతుభరోసా, రూ.4 వేల ఆసరా పింఛన్లు, కౌలు రైతులకు సాయం, రుణమాఫీ, ఆటో డ్రైవర్‌కు రూ.12వేలు, విద్యా భరోసా, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500, కల్యా ణలక్ష్మి తులం బంగారం.. ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలోనూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు.
తెలంగాణ గుండె చప్పుడుగా మారుతాం
అప్పులతో ప్రభుత్వాలను నడపడం మంచిది కాదని, అవి ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని నడ్డా స్పష్టం చేసారు. నిరుపేద వర్గాలకు కాంగ్రెస్ అన్యాయం చేసినందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయ కులను మాయలోళ్లతో అభివర్ణించారు. రేవంత్ రెడ్డిది గారడీల పాలనగా చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మోసాలు, రైతులు, మహి ళలు, యువకులు, కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని తాము నిర్ణయించామన్నారు. బీజేపీ తెలంగాణ గుండెచప్పుడుగా మారి ముందుకు సాగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలను లేవనెత్తి అధికారమే లక్ష్యంగా బీజేపీ ఉద్యమాలు చేస్తుందన్నారు.
తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు అదే గతి
కాంగ్రెస్ ఒక పరాన్నజీవి అని జేపీ నడ్డా దుయ్యబట్టారు. చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలపై ఆధారపడిందని ఎద్దేవాచేశారు. రీజనల్ పార్టీల బలహీనతలే హస్తం పార్టీ బలమని పేర్కొన్నారు. తమిళనాడు, జార్ఖం డ్ రాష్ట్రాల్లో ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌ను ఒక్కసారి ప్రజ లు తిరస్కరిస్తే మళ్లీ.. ఆ పార్టీని ప్రజలు ఆదరించిన దాఖాలాలు లేవని అన్నారు.
60 ఏళ్లుగా తమిళనాడులో, 30 ఏళ్లుగా గుజరాత్, ఉత్తరప్రదేశ్ , 25 ఏళ్లుగా బీహార్‌లో కాంగ్రెస్ అధికారంలోకే రాలేదన్నారు. రాను న్న రోజుల్లో తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఇదే గతి పట్టబోతోందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక బీజేపీకి ఆదరణ పెరిగింది తప్పితే తగ్గలేదన్నారు. 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో బీజేపీకి 5 కోట్లకు పైగా ఓట్లు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.
అనేక రాష్ట్రాల్లో బీజేపీ తిరిగి మళ్లీ అధికారంలో వస్తోందని, ఇప్పుడు 13 రాష్ట్రాల్లో బీజేపీ రూలింగ్‌లో ఉందని, మరో 6 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పా రు. తెలంగాణలోనూ బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారని నడ్డా చెప్పారు. తెలంగాణకు రూ.1.60 లక్షల కోట్లు ఇచ్చారని చెప్పారు.
ఇందులో రూ.1.12 లక్షల కోట్ల గ్రాంట్లు, వరంగల్‌కు రూ.రూ.27కోట్లు, టెక్స్‌టైల్, రైల్వేకు మరో రూ.20కోట్లు, వందేభారత్ రైళ్లు, జాతీయ రహదారులు, బీబీ నగర్‌లో ఎయిమ్స్ లాంటి ప్రాజెక్టులను మోదీ మంజూరు చేశారన్నారు. బీజేపీ ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తోందని, కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తోందన్నారు.
విగ్రహాల రూపాలు మారుతున్నాయ్ : మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
ఒక నియంత పాలనకు చరమగీతం పాడితే, మరొక నియంత వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో విగ్రహాల రూపాలు మారుతున్నాయి కానీ, ప్రజల జీవితాల్లో మార్పు రావట్లేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి హస్తం గుర్తు ఉండేలా రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టి, జనం నెత్తిన శఠగోపం పెడుతున్నారని అన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక కుటుంబం దోచుకుంటే.. కాంగ్రెస్ హయాంలో డజన్ల కుటుంబాలు దోచుకుంటున్నాయని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలు గుర్తున్నాయా?
ఎడాదిలో ఎంతో సాధించినట్లు విజయోత్సవాలు చేసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు గ్యారెంటీలు గుర్తున్నాయా? బస్సు లు లేకుండానే ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం ఏంటి? రైతులకు ఏం చేశారని రైతు పండుగ పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు. 420 అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ గెలిచింది. ఈ ప్రభుత్వం చేసేది రాజకీయ పండగే.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
అరచేతిలో వైకుంఠం చూపి..
కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠాన్ని చూపించి అధికారంలోకి వచ్చింది. పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్, ఏడాది కాంగ్రెస్ పాలన రెండూ రెండే. ఈ ప్రభుత్వానిది దగాకోరు, స్కామ్‌ల పాలన. కాంగ్రెస్ ఏలుబడిని చూసి ఆత్మలు గోషిస్తున్నాయి. భవిష్యత్‌లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరడం ఖాయం. కాంగ్రెస్‌కు ప్రజలు చరమగీతం పాడాలి. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
బీజేపీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్
కేసీఆర్, రేవంత్ కవల పిల్లలు : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
బీఆర్‌ఎస్, -కాంగ్రెస్ ఒకే తాను ముక్కలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. పాలనలో కేసీఆర్-, రేవంత్ రెడ్డి కవల పిల్లల్లాంటివారని అన్నారు. బీఆర్‌ఎస్ తరహాలోనే కాంగ్రెస్ అవినీతి, కుటుంబ, అహంకార పాలన కొనసాగిస్తోందన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్‌ఎస్ కుటుంబ, అహంకార, అవినీతి పాలనతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు.
ఏడాది పాలన గడిచినా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 100 రోజు ల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి 420 హామీలు గుప్పించారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 12 నెలలు గడిచిందని, ఇన్ని రోజుల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ర్టంలో నిజమైన మార్పు రావాలంటే బీజేపీనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ఉద్యమ శంఖారావం పూరించామన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ను గద్దెదించే వరకు పోరాటం చేస్తామని చెపారు. తెలంగాణ ప్రజలు, మేధావులు తమకు అండగా నిలవాలన్నారు.
రేవంత్ రెడ్డికి సంక్రాంతి డెడ్‌లైన్: కేంద్రమంత్రి బండి సంజయ్
రేవంత్ రెడ్డి భాష, చెప్తున్న అబద్ధాలను చూపి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. తిట్ల విషయంలో రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు తాత అయ్యారని ఎద్దేవాచేశారు. రేవంత్‌రెడ్డికి సంక్రాంతి వరకు డెడ్ లైన్ ఇస్తున్నామని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏఒక్క కాంగ్రెస్ నాయకుడిని గల్లీలో తిరగనీయబోమని హెచ్చరించారు.
తెలంగాణ ప్రజలెవరూ రేవంత్‌ను సీఎంగా గుర్తించడం లేదని అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని చెప్పారు. జీహెఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు. అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్‌రెడ్డి సర్కార్ బందీగా మారిందని విమర్శించారు. బంగ్లాదేశ్‌లో మాదిరిగా భాగ్యనగర్‌లోనూ హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
భాగ్యనగర్‌ను మరో బంగ్లాదేశ్‌గా మార్చే కుట్రలకు తెరదీశారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాక్ పీసులు కొనే పరిస్థితి లేదని, గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వర్గానికి కొమ్ముకాస్తుంటే చూస్తూ ఊరుకుందామా? అని ప్రశ్నించారు.
ఏం చేశారని విజయోత్సవాలు?
ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు, సంబురాలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామంటూ చెబుతున్న కాంగ్రెస్ పాలనలో గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు కూడా సరిగ్గా తిరగడం లేదు.
సంక్రాంతికి రైతు భరోసా, ఇండ్లు కట్టిస్తామంటూ మరోసారి మాయమాటలు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డి భాష తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉంది. నియంత పాలన వద్దని కాంగ్రెస్‌ను గెలిపిస్తే రేవంత్‌రెడ్డి కూడా అదే చేస్తున్నారు. రాష్ట్రాన్ని పాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ
ఏడాదిలో రోజుకో నాటకం
రేవంత్‌రెడ్డి ఏడాది పాలనలో హైడ్రా, మూసీ, లగచర్ల.. ఇలా రోజుకో కొత్త నాటకంతో కాలం వెల్లదీశారు. బిల్లులు రాక మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పాలనలో 50 మంది ఆటోడ్రైవర్లు సూసైడ్ చేసుకున్నారు. మహిళలకు రూ.2,500 సాయం అందలేదు.
ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వలేదు కానీ.. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పేరుతో ఏడాదిగా డ్రామా చేస్తున్నారు. ఎప్పుడు బుల్డోజర్లతో తమ ఇండ్లు కూలగొడతారోనని మూసీ పక్కన నివసించే వారు భయంతో బతుకుతున్నారు. పది నెలల్లోనే ప్రజల్లో రేవంత్ ప్రభుత్వం అబాసుపాలైంది.
మల్కాజీగిరి ఎంపీ ఈటల రాజేందర్




