25 April, 2026 | 7:47 PM

అంగరంగ వైభవంగా నృసింహ జయంతి ఉత్సవాలు

25-04-2026 06:06 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక  ఏర్పాట్లను చేయడం జరుగుతుందని దేవస్థానం  కార్యనిర్వహణాధికారి భవాని శంకర్ తెలిపారు. శనివారం కొండపైన ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరసింహ  స్వామి జయంతి ఉత్సవాలను  యాదగిరిగుట్టలో 26 నుంచి 30 వరకు ఐదు రోజుల పాటు అనుబంధ ఆలయమైన పాతగుట్టలో 27 నుంచి 30 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా  జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నాం.

భక్తులు వేల సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని అన్నారు. ఉత్సవాల నేపథ్యంలో భక్తుల సంఖ్య భారీగా పెరగడంతోయాదగిరిగుట్టలో ఐదు రోజులు, పాతగుట్టలో నాలుగు రోజులు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య-శాశ్వత సేవలు, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నరసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేయటం జరిగిందని తెలిపారు. యాదగిరిగుట్టలో 26న, పాతగుట్ట ఆలయంలో 27న వివిధ పూజా కార్యక్రమాలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం స్వామివారికి వివిధ అలంకార సేవలు నిర్వహించనున్నారిని,

నృసింహ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, రాష్ట్రం నుండి రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో భక్తులు రానుండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. యాదగిరి క్షేత్రం విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నట్లు తెలిపారు. 30 గురువారం స్వాతి నక్షత్రం సందర్భంగా కొండకింద అర్చక స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణం చేయడం జరుగుతుందని వేల సంఖ్యలో భక్తులు పాల్గొనాలని అన్నారు.ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి నరసింహమూర్తి, దేవస్థానం ప్రధాన అర్చకుడు  తాడూరి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.