కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేయండి
- అక్టోబర్ 22 నుండి శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు
- సంబంధిత అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): బ్రహ్మోత్సవాలకు అధికారులు సమన్వయం చేసుకొని అద్భుతంగా నిర్వహించాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర నియోజకవర్గం శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలపై జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ విజయందిర బోయి, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన కో - ఆర్డినేషన్ సమావేశంలో లో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ. జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించాలని కోరారు.
అలంకార మహోత్సవం రోజు, ఉద్దాల ఉత్సవం రోజు ప్రజలు లక్షలాదిగా తరలి వస్తారని, దానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని, క్యూ లైన్ ల వద్ద, పార్కింగ్ వద్ద పటిష్టమైన బారికేడ్ల వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ అందించేందుకు విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని, శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించాలని, మహాలక్ష్మీ ఉచిత బస్సు సౌకర్యం దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కువ బస్సులు నడపాలని పేర్కొన్నారు. ముఖ్యమైన రహదారులు వెడల్పు చేసి, రోడ్ల మరమ్మత్తులు పూర్తి చేయాలని, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటర్లను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీ పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు.
ఈవ్ టీజింగ్ దృష్టిలో ఉంచుకొని షీ టీంలు ఏర్పాటు చేయాలని, వీఐపీలకన్న సామాన్య భక్తులకే ప్రాధాన్యమివ్వాలని, భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశిస్తూ, అందరం కలిసికట్టుగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని ఎమ్మెల్యే జియంఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.






