26-08-2025 03:04:49 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): శ్రీ శ్రీ శ్రీ సద్గురు పూలాజీ బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖష్బూ గుప్తా, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు కోవ లక్ష్మి లతో కలిసి జైనూర్ మండలం పట్నాపూర్ లో పూలాజీ బాబా సంస్థాన్ లో నిర్వహించనున్న జయంతి వేడుకలపై అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30 న శ్రీశ్రీశ్రీ పూలాజీ బాబా జయంతి వేడుకలను అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేయాలని తెలిపారు.
వేడుకలకు వచ్చే భక్తులకు, ప్రముఖులకు, వాహనాల పార్కింగ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, వాహనాలు ఒకే వరుసలో వెళ్లే విధంగా పోలీస్ శాఖ అధికారులు రూట్ మ్యాప్ తయారు చేసుకోవాలని తెలిపారు. పార్కింగ్ స్థలంలో గుంతలు, రహదారులపై గుంతలు లేకుండా మొరం పోసి మరమ్మత్తు చేయాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించాలని తెలిపారు. నిరంతర విద్యుత్ సౌకర్యం, వీధి దీపాలు అమర్చాలని, జాతరలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, బ్లీచింగ్ పౌడర్, దోమల మందు పిచికారి చేయాలని, పారిశుధ్య నిర్వహణపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని తెలిపారు.
భక్తులకు త్రాగునీటి సౌకర్యం, మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేయాలని, ఆసిఫాబాద్, ఉట్నూర్, ఆదిలాబాద్ డిపోల నుండి ఆర్.టి.సి. బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. జాతరలో భక్తులు అనారోగ్యానికి గురికాకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బందితో కూడిన వైద్య శిబిరాలు నిర్వహించి భక్తులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. భోజన వసతి వద్ద ఎలాంటి గందరగోళ పరిస్థితులు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, ప్రముఖుల కొరకు భారీ కేట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జయంతి వేడుకలను అధికారులు, నిర్వహణ కమిటీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించి విజయవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పులాజి బాబా తనయుడుఇంగళ్ళే కేశవ్ రావు జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాధ్, సంస్థాన్ అధ్యక్షులు ఇంగ్లే కేశవరావు, విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శేషరావు, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, మిషన్ భగీరథ ఈ ఈ సిద్ధిక్, ఆసిఫాబాద్ సి ఐ వరప్రసాద్, సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.