07-12-2025 04:35:46 PM
ఇక్కడ పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కాదు. రెడ్ది, బీసీల మధ్యనే
ముల్కనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీసీ బిడ్డ దార్న శ్రీనివాస్ కే బీసీ జేఏసీ మద్దతు
హనుమకొండ (విజయక్రాంతి): ముల్కనూర్ గ్రామ సెంటర్ లో బహుజన ముఖ్య నాయకులు సమావేశం బీసీ జేఏసీ ముల్కనూర్ మండల అధ్యక్షులు మండల సురేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంనికి ముఖ్య అతిధిగా పాల్గొన్న బీసీ జేఏసీ వరంగల్ ఉమ్మడి జిల్లా చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని చెప్పి, బీసీల ఓట్లను దండుకొని, అధికారంలోకి వచ్చాక బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, పార్టీ పరంగానైన 42 శాతం రిజర్వేషన్లను కల్పించకపోవడం, బీసీ అభ్యర్థులు పోటీచేసిన చోట రెడ్డి అభ్యర్థులను నిలబెట్టి, రెడ్ల రాజ్యం కోసం ఆరాటపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలంటే 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ, సమాజమంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని, ముల్కనూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బీసీల ముద్దుబిడ్డ దార్న శ్రీనివాస్ కు బహుజన సమాజమంతా మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు.
జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులను గెలిపించుకోవడం ద్వారా మన ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని, రిజర్వేషన్లను కల్పించకుండా అడ్డుకుంటున్న బీజేపీ పార్టీలను బహుజన సమాజమంతా ఏకమై బుద్ధి చెప్పాలన్నారు. బీసీ రిజర్వేషన్లను కల్పించకపోవడంతో మనస్థాపం చెందిన సాయి ఈశ్వరాచారి ఆత్మ బలిదానం చేశాడని, బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి దార్న శ్రీనివాస్ ను గెలిపించుకొని ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా కృషి చేయాలన్నారు.
ఇక్కడ పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య కాదు అని, రెడ్డి బహుజనుల మధ్యనే అని అన్నారు. బీసీ విద్యావంతులు వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ మాట్లాడుతూ ఏ పార్టీ నుండైన నిలబడిన బహుజన సోదరులను రాష్ట్రవ్యాప్తంగా గెలిపించుకొని బహుజన సమాజం సత్తా చాటాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ విద్యావంతులు వేదిక హన్మకొండ జిల్లా అధ్యక్షులు డా. చందా మల్లయ్య, మాజీ జడ్పీటీసీ వంగ రవీందర్ గౌడ్, బీసీ జేఏసీ జిల్లా నాయకులు కాసగాని అశోక్ గౌడ్, ఛాతిళ్ళ కమలాకర్, సంగ సంపత్ యాదవ్, మండల సురేందర్, అప్పని పద్మ, నవాబ్ పాషా, శనిగరపు సదానందం, ధర్నా మోహన్దాస్ తదితరులు పాల్గొన్నారు.