13-07-2025 01:12:43 AM
- ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం
- ఓయూ తర్వాతి స్థానం నకిరేకల్‌దే..
- తొలి పీడీ యాక్ట్ కేసు ఇక్కడి నుంచే..
నకిరేకల్ ఉద్యమాల పురిటిగడ్డ.. ఇక్కడి ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులు. మొదటి నుంచి కమ్యూనిస్టు ప్రభావిత ప్రాం తం కావడంతో ఉద్యమాలు ఇక్కడి ప్రజలకు కొత్తేమీ కా దు. తెలంగాణ రైతాంగ సా యుధ పోరాటం దగ్గరి నుం చి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వరకు నకిరేకల్ కీలకపాత్ర పోషించింది. నకిరేకల్ నియోజకవర్గం రాజకీయంగానూ ఎంతోమంది ఉద్ధండులను అందించింది. ఉమ్మడి పాలనాకాలంలో తెలంగాణ, ఆంధ్రాప్రాంతానికి ప్రధాన వారధిగా నిలిచిన హైదరాబాద్- జాతీయ రహదారి నకిరేకల్ పట్టణం మీదుగానే వెళుతుంది.
దీంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో ఇక్కడ నిత్యం నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు.. ఇలా ఒక్కటేమిటి నకిరేకల్ కేంద్రంగా రాష్ట్ర సాధన కోసం జరగని క్రతువంటూ లేదని చెప్పాలి. ఉద్యమం ఏ సమయంలో చల్లారిందనే భావన కలిగినా.. నకిరేకల్ ప్రాంతవాసులు చేసే ఆందోళనతో మరోక్కసారి పెల్లుబికిన సందర్భాలు కోకొల్లలు.
ఉద్యమంలో తొలి పీడీ యాక్టు కేసు ఇక్కడే..
మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో తరహాలో నకిరేకల్ గడ్డపై తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఉద్యమ సమయంలో కొంతమంది గ్రామీణ ప్రాంతాల నుంచి సద్ది కట్టుకుని మరీ నకిరేకల్లో ఉద్యమం చేసి మళ్లీ ఇంటికి పోయే వచ్చేటోళ్లు. నిత్యం నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రహదారి దిగ్బంధనాలు, వంటా వార్పు, ఇలా ఒక్కటేమిటీ నెలల తరబడి తమ పనులు మానుకొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉద్యమకారులకు ఇక్కడ కొదవలేదు.
అయితే సకల జనుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ బస్సులపై దాడి ఘటన నేపథ్యంలో డాక్టర్ చెరుకు సుధాకర్‌పై తొలి పీడీ యాక్ట్ కేసు నమోదవ్వడం అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. దాదాపు ఏడాది పాటు ఆయన వరంగల్‌లో జైలు జీవితం గడిపారు. ఆ ఘటన ఉద్యమానికి మరో కొత్త ఊపును తీసుకొచ్చింది. మరోవైపు ఆంధ్రా ప్రాంతానికి వెళ్లడానికి నకిరేకల్ మీద నుంచి వెళ్లే జాతీయ రహదారి ప్రధాన మార్గం కావడంతో ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక అలజడి కనిపిస్తూనే ఉండేది.
చీమ చిటుక్కుమన్నా... ఉద్యమ కారులంతా క్షణాల్లోనే రోడ్లపైకి చేరుకొని తెలంగాణ నినాదాన్ని గొంతెత్తోటోళ్లు. ఇప్పటి తరహాలో అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం గానీ, అందుకు కావాల్సిన సాధనాలు గానీ పెద్దగా ప్రజలు, ఉద్యమకారుల వద్ద లేవు. కానీ ఉద్యమం పట్ల ఉన్న కమిట్‌మెంట్.. తెలంగాణ వాదం పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్ధరాత్రి.. అపరాత్రి అన్న తేడా లేకుండా పోరాడేలా చేసింది. కానీ నేడు మాత్రం నకిరేకల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలోనే నిలిచిందని చెప్పాలి. పదేండ్ల బీఆర్‌ఎస్ కాలంలోనూ నకిరేకల్ పెద్దగా అభివృద్ధి చెందకపోవడం కొసమెరుపు.