04-05-2025 01:10:10 AM
పనాజీ, మే 3: గోవాలోని శిర్గావ్‌లోని లైరాయి దేవి ఆలయంలో శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. వార్షిక జాతర పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 80 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది.
క్షతగాత్రుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారవర్గాలు వెల్లడించాయి. లైరాయి ఆలయంలో శుక్రవారం నుంచి వార్షిక జాతర ప్రారంభమైంది. గోవా లైరాయి దేవిని పార్వతిదేవి అవతారంగా భక్తులుకొలుస్తారు. ఈ జాతరకు గోవా నుంచే కాకుండా పొరుగున్న ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తుంటారు. అయితే శనివారం తెల్లవారుజామున ‘అగ్ని దివ్య’ కార్యక్రమంలో భాగంగా భక్తులు నిప్పుల గుండంపై నడిచి మొక్కులు తీర్చుకుంటారు.
అయితే నిప్పుల గుండంలో నడిచేందుకు పెద్ద ఎత్తున భక్తులు తోసుకురావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఒకరిపై ఒకరు పడడం.. నిప్పులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తొక్కిసలాటలో గాయపడిన వారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరామర్శించారు. విద్యుత్ షాక్ కారణం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపారు. ఘటనపై ఆరా తీసిన ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.