30 June, 2026 | 2:10 AM

ఎగుమతి కేంద్రంగా రాష్ట్రం

30-06-2026 12:22 AM
  1. ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు
  2. రైతులకు, రైస్ మిల్లర్లకు రెట్టింపు లాభాలు
  3. ప్రపంచ మార్కెట్లే లక్ష్యంగా ఫోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తులు
  4. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
  5. కేసీపీ న్యూట్రీ సంస్థ మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తుల ప్రారంభం

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయి బియ్యం ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, తెలంగాణలో బియ్యం ఎగుమతులను భారీ స్థాయిలో ప్రోత్స హించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను పరిశీలిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి  ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. కేసీపీ న్యూట్రీ సంస్థ రూపొందించిన మల్టీ విటమిన్ రైస్ ఉత్పత్తులను సోమవారం హైదరాబాద్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న బియ్యానికి దేశీయ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది గానీ ఎగుమతుల కోసం కాదని, అందుకే తెలంగాణ ప్రభుత్వం బియ్యం ఎగుమతులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతోందని తెలిపారు.

రాష్ట్ర రైతులు, రైస్ మిల్లర్ల ప్రయోజనాల కోసం దేశీయ మార్కెట్లతో పాటు విదేశీ మార్కెట్లను కూడా లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎగుమతులు చేపట్టే పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, అవసరమైన అనుమతులను సైతం వేగంగా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

మల్టీ విటమిన్ రైస్ వంటి విలువ ఆధారిత ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ మంచి ఆదరణ పొందే అవకాశముందని చెప్పారు. రాష్ట్ర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాలు, విదేశీ మార్కెట్లకు చేరేలా ప్రభుత్వం అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తుందని స్పష్టం చేశారు.

దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

వ్యవసాయరంగంలో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. ఈ ఏడాది యాసంగి సీజన్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం 81 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని, అదే సమయంలో భౌగోళికంగా పెద్ద రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 25 లక్షల టన్నుల కొను గోలు మాత్రమే జరిగిందని మంత్రి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు కోసం రైతుల బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికే రూ.19,303 కోట్లను జమ చేసినట్లు వెల్లడించారు. పారదర్శకతతో, వేగవంతంగా రైతులకు చెల్లింపులు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు.

వానాకాలం, యాసంగి సీజన్లను కలిపి చూస్తే రాష్ట్రంలో బియ్యం ఉత్పత్తి 300 లక్షల టన్నులు దాటిందని తెలిపారు. రాష్ట్ర ప్రజల వినియోగం సంవత్సరానికి కేవలం 36 లక్షల టన్నులు మాత్రమే ఉండటంతో తెలంగాణ ఇప్పుడు మిగులు బియ్యం ఉత్పత్తి రాష్ట్రంగా ఎదిగిందని పేర్కొన్నారు. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల ఆధునీకరణ, సాగునీటి విస్తరణ, రైతులకు నిరంతర నీటి లభ్యత కల్పించడం వల్లే రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.