రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి!
తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఆమె పేరే ప్రింట్
విద్యాశాఖ ఉన్నతాధికారుల పేర్లు సైతం పాతవే..
ఎస్‌సీఈఆర్టీ అధికారుల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): ఇప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇంకా సబితా ఇంద్రారెడ్డినే.. అవునండీ..! మీరు నమ్మడం లేదా..? విద్యార్థులకు అందించిన పాఠ్యపుస్తకాలను ఒక్కసారి పరికిస్తే మీరే నమ్ముతారు. అది ఎలా అంటారా? ఈ విద్యాసంవత్సరంలో స్టేట్ కౌన్సిల్ ఆఫ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) ప్రింట్ చేయించిన పాఠ్య పుస్తకాల్లో ఇప్పటికీ విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిపేరు, ఇతర అధికారులుగానూ పాత పేర్లే ప్రింట్ కావడం నిర్లక్ష్యానికి టాప్ ఉదాహరణ?
మంత్రి, అధికారులూ పాతవారే..
బడులు ప్రారంభమైన తొలిరోజే విద్యార్థులకు అందించిన పాఠ్య పుస్తకాలను చూసి చదువరులు నివ్వెరపోయారు. తెలుగు పుస్తకాల్లోని ముందుమాటలో ‘రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి’గా ప్రింట్ అయి కనిపించింది. అలాగే ‘పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి రంజీవ్ ఆచార్య, ప్రస్తుత డైరెక్టర్ టి.చిరంజీవులు, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి ప్రత్యేక ధన్యవాదాలు’ అనే ముద్రించడం శోచనీయం. వీరంతా 2015లో ఆయా శాఖలకు బాధ్యత వహించిన వారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యాశాఖకు మంత్రి లేరు. ఈ శాఖను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా శ్రీదేవసేన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శ్రీదేవసేన మూడేళ్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. వారి ప్రస్తావనే పాఠ్య పుస్తకాల్లో లేదు.
గతంలోనూ ఇలానే...
పాఠ్యపుస్తకాల ముద్రణలో ఎస్సీఈఆర్టీ అధికారుల వైఫల్యం కనబడుతోంది. గతంలోనూ ఓ తరగతి సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకంలో కొత్త పీఠికకు బదులు పాత పీఠికనే ముద్రించారు. ఈ అంశం అప్పట్లో పెద్ద విమర్శలకు దారితీసింది. ఈ విషయం బయటకు రావడంతో ఎస్సీఈఆర్టీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు సవరించిన పీఠిక కలర్ జిరాక్సులను పాఠ్య పుస్తకాల్లో అంటించి మేనేజ్ చేశారు. తాజాగా జరిగిన పొరపాటుపై ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డిని వివరణ కోరగా.. ‘మళ్లీ పుస్తకాలను రివైజ్డ్ చేసినప్పుడు మాత్రమే పేర్లను మారుస్తామని, పేర్లు మార్పుపై ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని సమాధానమిచ్చారు.






