calender_icon.png 27 November, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త థర్మల్ కేంద్రాలు అవసరమా?

27-11-2025 01:11:47 AM

రెన్యూవబుల్ ఇంధన వనరులు ఉన్నాయి కదా!

పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్న థర్మల్ కాలుష్యం, బూడిద

  1. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయంపై పర్యావరణవేత్తలు, నిపుణుల అసంతృప్తి
  2. రామగుండంలో మరో 800 మెగావాట్ల థర్మల్ కేంద్రం ఏర్పాటు నిర్ణయంపై సర్వత్రా చర్చ
  3. ఇప్పటికే సింగరేణి ఆధ్వర్యంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పనులు మొదలు
  4. బొగ్గు లేనిదగ్గర థర్మల్ విద్యుత్తు కేంద్రాల ఏర్పాటును పరిశీలించాలనే నిర్ణయంపై విస్మయం

* ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో విద్యు త్తు ఉత్పత్తి పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)ను మెల్లమెల్లగా తగ్గి స్తూ వస్తున్నారు. సౌర, జల, వాయు విద్యుత్తు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇలా థర్మల్‌ను తగ్గిస్తూ వస్తున్నారు.

* రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్తు కేంద్రంతోపాటు, పాల్వంచతోపాటు.. బొగ్గు గనులతో ఎలాంటి సంబంధంలేని మక్తల్‌లో థర్మల్ విద్యుత్తు కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. థర్మల్ వద్దని అందరూ నెత్తినోరూ కొట్టుకుంటుంటే.. అందులోనూ ఎన్టీపీసీ, జెన్‌కో ఆధ్వర్యంలో ఎవరు తక్కువ ధరకు ఇస్తే.. వారికే అప్పగిస్తామంటూ నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏంటనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయా లతో ముందుకు వెళుతుందా, వెనక్కి వెళుతుందా.. అనే అనుమానాలు కలుగుతు న్నాయి. తాజాగా మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో థర్మల్ విద్యుత్తు కేంద్రాలను ఏర్పాటు విషయంలో తీసుకున్న నిర్ణయాలపై అటు రాజకీయ విశ్లేష కులు, ఇటు పర్యావరణవేత్తలు, మరోవైపు విద్యుత్తు రంగ నిపుణుల నుంచి తీవ్ర ఆశ్చ ర్యం, అసంతృప్తి వ్యక్తమవుతున్నాయి.

ఆ నిర్ణయాలపై చర్చ మొదలైంది. రాష్ట్రంలో ఏటికేడాది పెరుగుతున్న విద్యుత్తు డిమాం డ్, అలాగే రాబోయే పదేండ్లకు ఎంత కరెం టు అవసరం, ఎంత ఉత్పత్తి అవసరమనేదానిపై క్యాబినెట్ భేటీలోచర్చించి, అధికా రులు తయారుచేసిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను చూసిన తరువాత రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యు త్తు ప్లాంట్‌ను నిర్మించాలని, అలాగే పాల్వంచ, మక్తల్‌లలో థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలనే నిర్ణయాలపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తంఅవుతోంది.

ఇప్పటికే ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వస్తున్న కాలుష్యం, గుట్టలకొద్దీ పోగవుతున్న బూడిదను ఏం చేయాలో తెలియక అధికారులు అల్లాడుతుండగా.. మరిన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలనే ఆలోచనపై విద్యుత్‌రంగ నిపుణుల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

రెన్యూవబుల్ ఎనర్జీపై ముందుకు..

వాస్తవానికి థర్మల్ విద్యుత్తు కన్నా.. రెన్యూవబుల్ (పునరుద్ధరణీయ) ఇంధన వనరుల ఉత్పత్తి, వినియోగం పెంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం అనేక రకాల పథకాలను అమలులోకి తీసుకొస్తోంది. పర్యావరణానికి విఘాతం కల్గించే థర్మల్ విద్యుత్తును మెల్లగా తగ్గిస్తూ.. సౌర, పవన, జల విద్యుత్తులపై దృష్టి సారించేలా మార్గదర్శకాలను కూడా కేంద్రం జారీచేసింది. ఈ నేపథ్యంలోనే మంగళవారం క్యాబినెట్ సమావేశంలో ఇందుకు అనుగుణంగా.. 3,000 మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు వీలైనంత తొందరగా టెండ ర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.

అలాగే కొత్తగా 2,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్‌ను కొనుగోలుకు వీలుగా టెండర్లు పిలవాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు రాష్ట్రం లో 10 వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు వీలుగా.. ఆసక్తిచూపే కంపెనీలను అవసరమైన భూమి, నీటిని కేటాయించాలనికూడా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రకటించారు.

పైగా ఈ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కంలకే అమ్మాలనే షరతుపైకూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనితోపాటు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా.. రాష్ట్రంలో కొత్తగా స్థాపించే పరిశ్రమలు వాటి అవసరాలమేరకు సొంతంగా (క్యాప్టివ్) ఉత్పత్తి చేసుకు నేందుకు వీలుగా వెంటనే అనుమతులు ఇవ్వాలనికూడా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

పీఎల్‌ఎఫ్ తగ్గిస్తూ..

నిజానికి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తి పీఎల్‌ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్)ను మెల్లమెల్లగా తగ్గిస్తూ వస్తున్నారు. సౌర, జల, వాయు విద్యు త్తు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఇలా థర్మల్‌ను తగ్గిస్తూ వస్తున్నారు. తెలంగా ణ జోన్‌కో ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొత్తం 5580 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాలున్నాయి. 2023- 24లో 79.64 శాతం పీఎల్‌ఎఫ్‌తో విద్యుత్తును ఉత్ప త్తి చేయగా.. 2024-25లో 65.01 శాతం పీఎల్‌ఎఫ్‌తో థర్మల్ విద్యుత్తు ప్లాంట్ల లో ఉత్పత్తిని చేశారు.

అదే 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు (నవంబర్ 13 నాటికి) కేవలం 56.03 శాతం పీఎల్‌ఎఫ్‌తోనే థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. పైగా యాదాద్రి థర్మల్‌లో మరో మూడు యూనిట్లు (2400 మెగావా ట్లు) వచ్చే సంవత్సరం నాటికి పూర్తిగా అందుబాటులోకి రా నుంది. దీనికితోడు ప్రైవేటు థర్మల్ ప్లాంట్ల నుంచి, అలాగే కేంద్రం నుంచి మనకు వస్తున్న థర్మల్ విద్యుతు ఉండనే ఉంది.

ఇదీ కాకుం డా.. సింగరేణి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద మూడో యూనిట్ (800 మెగావాట్లు) పనులుకూడా ప్రారంభం అయ్యాయి. ఒకవంక థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) శాతాన్ని తగ్గిస్తూ... ఉత్పత్తిని తగ్గిస్తూనే.. మరోవంక కేంద్రం రెన్యూవబుల ఎనర్జీపై మార్గదర్శకాలను ఉటంకిస్తూ.. సౌర, వాయు, జల విద్యుత్తు ఉత్పత్తి, వినియోగంపై ఫోకస్ పెట్టామని చెబుతున్న ప్రభుత్వం.. మరోవైపు కొత్తగా థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలనే ఆలోచన చేయడం విద్యు త్తు రంగ నిపుణులు, రాజకీయ విశ్లేషకుల అసంతృప్తికి  కారణమవుతోంది.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం..

సౌర విద్యుత్తు పగటిపూట ఉత్పత్తి అవుతుందని.. రాత్రిపూట, డిమాండ్ ఉన్నప్పుడు ఎలా అనే అనుమానాలకు పరిష్కారం చూపింది.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బీఈఎస్‌ఎస్). మంగళవారమే తెలంగాణ జోన్‌కో ఆధ్వర్యంలో 750 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్తును నిల్వచేసి డిమాండ్ ఉన్నప్పుడు వాడుకునేలా గ్లోబల్ టెండర్లనుకూడా పలిచింది. అలాగే సింగరేణి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా మందమర్రిలో ఒక మెగావాట్ సామర్థ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం (బీఈఎస్‌ఎస్) నిర్మాణం పూర్తయ్యింది. రెండు రోజుల్లో దీనిని ప్రారంభించనున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఇలాంటి బీఈఎస్‌ఎస్ లను ఏర్పాటు చేస్తామని సింగరేణి ప్రకటించింది. అంటే ఇంతవరకు లేని విధంగా సౌలభ్యం మనకు అందుబాటులోకి వచ్చింది.

గుట్టలుగా.. బూడిద.. 

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 5,580 మెగావాట్ల సామర్థ్యంతో పనిచేస్తున్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల నుంచి వస్తోన్న బూడిదను ఏం చేసుకోవాలో అర్థంకాక.. అధికా రులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో సుమారు 10 కోట్ల మెట్రిక్ టన్నుల బూడిద పేరుకుపోయిందని అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా మరిన్ని థర్మల్ విద్యుత్తు కేంద్రాలను నిర్మించాలని క్యాబినెట్‌లో తీర్మానించడం.. పైగా అసలే బొగ్గు లేని మక్తల్ లాంటి ప్రదేశాల్లో థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై అధ్యయనం చేయాలనే క్యాబినెట్ నిర్ణయం వెను క ఏం జరిగి ఉంటుందనే ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి.

బొగ్గు లేనిచోట కూడా..

పర్యావరణహితమైన రెన్యూవబుల్ ఎనర్జీ, అలాగే గ్రీన్, క్లీన్ ఎనర్జీపై మంచి నిర్ణయాలు తీసుకున్నారని అందరూ అనుకు న్నారు. కానీ.. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ విద్యు త్తు కేంద్రంతోపాటు.. పాల్వంచతోపాటు బొగ్గు గనులతో ఎలాం టి సంబంధంలేని మక్తల్‌లో థర్మల్ విద్యు త్తు కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కూడా క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం విస్మయం. 

పరిస్థితులు ఇలా.. నిర్ణయాలు అలా..

రాష్ట్రంలో పరిస్థితులు సౌర, పవన, హైడ్రో, పంప్డ్ స్టోరేజీ విద్యుత్తు ఉత్పత్తికి అనుకూలంగా ఉండగా.. అందుకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకున్న క్యాబినెట్.. మరోవైపు పర్యావరణానికి విఘాత కల్గిస్తున్న, ఇప్పటికే కోట్ల మెట్రిక్ టన్నుల బూడిద నిల్వలను మనకు మిగిల్చిన థర్మల్ విద్యుత్తు కేంద్రాలను కొత్తగా నిర్మించాలనే నిర్ణయం తీసుకోవడంతో.. ప్రభుత్వం ముందుకు వెళుతుందా.. వెనక్కి వెళుతుందా.. అనుమానాలు కలుగుతున్నాయి.

సంవత్సరం  థర్మల్ విద్యుత్తు కేంద్రాల పీఎల్‌ఎఫ్ (శాతం) విద్యుత్తు ఉత్పత్తి(మిలియన్ యూనిట్లలో)

2023-24                                                          79.64                      28280.07

2024-25                                                       65.01                      24053.97

2025-26 (అక్టోబర్ చివరి నాటికి)                   56.03                       15442.52