ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మేలు జరిగే విధంగా చూడాలి
సూర్యాపేట ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు మేలు జరిగే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి ప్రారంభించారు.
తదుపరి ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 281 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, వడ్ల మిల్లులను కూడ గుర్తించడం జరిగిందన్నారు. కొనుగోలు కేంద్రాలకు వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 4 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రావచ్చన్నారు. ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బేసిక్ మౌలిక సదుపాయాలైన వేయింగ్ మిషన్లు, మాయిశ్చరైజింగ్ మిషన్లు, త్రాగునీరు, టెంట్లు, వర్షాలు వస్తే అత్యవసరం పరిస్థితులలో టార్బలిన్ పట్టాలు, టాగింగ్ మిషన్లు, సన్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో కాలిబర్ స్కేల్స్ ఏర్పాటు చేశామన్నారు.,
2,3 మండలాలకు కలిపి ఒక ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ను ఏర్పాటు చేశామని , జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే కాంటాలు వేయాలని సూచించారు. అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున రైతులను ముందుగానే అప్రమత్తం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై అధికారులు మోహన్ బాబు, శ్రీధర్, జిల్లా కోపరేటివ్ అధికారి ప్రవీణ్, అధికారులు పిఎసిఎస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




