నకి‘లీల’పై ఉక్కుపాదం
కామారెడ్డి, మే 25 (విజయక్రాంతి)/బెల్లంపల్లి : నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దుకాణాలపై మెరుపు దాడులు చేస్తూ అక్రమార్కుల గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్నారు. శనివారం కామారెడ్డి జిల్లాలో విత్తన, ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, సదాశివనగర్, లింగంపేట్, దోమకొండ, మాచారెడ్డి, బీర్కూర్ మండల కేంద్రాల్లో వ్యవసాయ, పోలీస్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. కొంత మంది వ్యాపారులు లైసెన్స్ లేని దుకాణాలను ఏర్పాటు చేసి, రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు కట్టబెడుతున్నారని ఆరోపణలతో దాడులు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా ఫర్టిలైజర్ దుకాణాలలోని రికార్డులు, లైసెన్స్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ.. రైతులు ఎవరూ కూడా లైసెన్స్ లేని దుకాణాలల్లో విత్తనాలు, ఎరువులను, క్రిమిసంహారక మందులను కొనుగోలు చేయవద్దని సూచించారు. కొన్నవాటికి కచ్చితంగా బిల్లులు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు రైతులకు విక్రయించినట్లయితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
అనుమతి లేని విత్తనాలు పట్టివేత
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని బొప్పారంలో అనుమతి లేని 20 కిలోల పత్తి విత్తనాలను వ్యవసాయ అధికారులు, పోలీసులు పట్టుకున్నారు. పక్కా సమాచారంతో నెన్నెల వ్యవసాయాధికారి ప్రేమ్‌కుమార్, పోలీసులు గ్రామానికి వెళ్తుండగా.. బొప్పారం క్రాస్‌రోడ్డు వద్ద నారా పురుషోత్తం అనే వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని తనిఖీ చేయగా, అతని వద్ద అనుమతి 20 కిలోల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిని నెన్నెల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.






