calender_icon.png 30 December, 2025 | 4:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేర రహిత సమాజం దిశగా చర్యలు

30-12-2025 02:16:26 AM

జిల్లా ఎస్పీ నీతిక పంత్

వార్షిక నేర నివేదిక విడుదల

కుమ్రం భీం ఆసిఫాబాద్,డిసెంబర్ 29(విజయక్రాంతి): జిల్లాలో పోలీసుల తనిఖీలు పెద్ద ఎత్తున పెరగడంతో 2024తో పోలిస్తే 2025లో నేరాల సంఖ్య పెరిగిందని జిల్లా ఎస్పీ నీతిక పంత్ తెలిపారు. జిల్లా కేంద్రంలో ని డీపీఓ కార్యాలయంలో కాగజ్నగర్ డీఎస్పీ వహీబుద్దీన్తో కలిసి ఆమె వార్షిక నేర నివేదిక ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 2024లో జిల్లాలో 1,207 సాధారణ నేరాలు నమోదుకాగా, 2025లో అవి 1,934కు పెరిగాయని, ఇది 60.23 శాతం వృద్ధిగా పేర్కొన్నారు. నేరాల సంఖ్య పెరగడానికి పోలీసుల విస్తృత తనిఖీలు, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, వరకట్న వేధింపులు, గృహ హింస వంటి అంశాలే కారణాలని విశ్లేషించారు.

నేరాల నియంత్రణ కోసం అవగాహన కార్యక్రమాలకు పెద్దపీట వేస్తూ కలబృందాల ద్వారా 151 కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజల నుంచి నేరుగా 232 పిటిషన్లు స్వీకరించగా, అందులో 220 పిటిషన్లను పరిష్కరించినట్లు చెప్పారు. గ్రామీణ పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 278 గ్రామ పోలీస్ అధికారులను నియమించినట్లు వివరించారు.  నేరాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి పోలీస్ స్టేషన్ను చిన్నచిన్న విభాగాలుగా విభజించి, హాట్స్పాట్ ప్రాంతాలను గుర్తించి నిరంతర తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. వాహన తనిఖీలలో 3,757 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి, వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.1,04,526 జరిమానా వసూలు చేసినట్లు వెల్లడించారు.

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కార్డెన్ సెర్చ్, నాకాబందీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ను పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు. పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 143 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు పేర్కొన్నారు.

మహిళల రక్షణకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ షీ టీమ్స్ ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామని, బాధిత మహిళల కోసం భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 43 మందికి ఆశ్ర యం కల్పించినట్లు చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచి స్తూ, గత ఏడాది 315 పిటిషన్లు స్వీకరించగా 37 ఎఫ్‌ఐఆర్లు నమోదు చేశామని తెలిపారు. సైబర్ మోసాల ద్వారా రెండు కోట్ల రూపాయలకుపైగా నష్టం జరగకుండా అడ్డుకోవడంతో పాటు రూ.4,78,000 తిరిగి బాధితులకు చెల్లించామని, రూ.17 లక్షలకుపైగా నగదును నిలిపివేసినట్లు వెల్లడించారు.

నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ కారణంగా జిల్లాలో 267 రోడ్డు ప్రమాదాలు సంభవించాయని తెలిపారు. కోర్టుల ద్వారా శిక్ష పడిన కేసులు గత ఏడాది 48 ఉండగా, ఈ ఏడాది 46గా ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద 38 కేసులు నమోదు కాగా, ఇతర ఐపీసీ/బీఎన్‌ఎస్ కేసులు 1,095 నమోదైనట్లు వివరించారు.

మహిళలపై గృహహింస, హత్య, హత్యాయత్న కేసులు గత ఏడాది 99 కాగా, ఈ ఏడాది 106కు చేరాయని తెలిపారు. గంజా యి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంతో దాడులు నిర్వహించి 73 కేసులు నమోదు చేసి 122 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. చిన్నపిల్లల రక్షణే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ ము స్కాన్, ఆపరేషన్ స్త్మ్రల్ కార్యక్రమాల ద్వారా 105 మంది పిల్లలను రక్షించినట్లు తెలిపారు. లోక్ అదాలత్ ద్వారా 4,118 కేసులను పరిష్కరించినట్లు వెల్లడించారు.

అత్యవసర పరిస్థితు ల్లో ప్రజలు 100కు డయల్ చేయాలని సూచించారు. అవగాహన లోపంతో ప్రజలు నిబంధనలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, దొంగతనాల రికవరీ రేటు పెంచేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టామని తెలిపారు. మావోయిస్టులకు సం బంధించిన అంశాలు రాష్ట్ర పోలీస్ శాఖ పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు.

కొత్త సంవత్సర వేడుకలపై సూచనలు

వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పత్రికా విలేకరుల ప్రశ్నలకు స్పందించిన జిల్లా ఎస్పీ నీతిక పంత్ జిల్లాలోని లాడ్జీలు, ఫంక్షన్ హాల్స్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడైనా అక్రమ కార్యక్రమాలు నిర్వహిస్తే కఠి న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏవైనా వేడుకలు నిర్వహించాలంటే ముందస్తు గా పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడి పితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

కొత్త సంవత్సరానికి సంబంధించి మద్యం దుకాణాల మూసివేత సమయాలు సహా ఇత ర నిబంధనలు రాష్ట్ర పోలీస్ శాఖ ఆదేశాల మేరకు అమలు చేస్తామని తెలిపారు. అనంతరం గంజాయి సహా ఇతర మాదకద్రవ్యాల నియంత్రణలో విశేష కృషి చేసిన జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన 31 మంది సిబ్బందికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో అందించిన రివా ర్డులను ఎస్పీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.