calender_icon.png 9 December, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టాక్ మార్కెట్ డమాల్

09-12-2025 02:13:58 AM

  1. ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్లు ఆవిరి 
  2. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సందిగ్ధత ప్రభావం

ముంబై, డిసెంబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ఒక్కరోజే భారీ నష్టాల్లో ముగిశాయి. విదేశీ మదుపర్ల అమ్మకాలు, బలహీనపడిన రూపాయి విలువ మార్కెట్‌పై తీవ్రమైన ప్రభావం చూపాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీ (బీఎస్‌ఈ)లో నమోదిత కంపెనీల మొత్తం విలువ సుమారు రూ.7 లక్షల కోట్లకు పెగా ఆవిరై రూ.463 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 609.68 పాయింట్ల నష్టంతో 85,102.69 వద్ద, నిఫ్టీ 225.90 పాయింట్ల నష్టంతో 25,960.55 వద్ద స్థిరపడ్డాయి.

స్టాక్ ఎక్సేంజ్ పతనం కారణంగా టెక్ మహీంద్రా, రిలయన్స్, హెడీఎఫ్‌సీ మినహా మిగిలిన ప్రధాన షేర్లు నష్టాల్లో ముగిశాయి. స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు దాదాపు 2 శాతం మేర పతనమయ్యాయి. బీఈఎల్, ఎటెర్నెల్, ట్రెంట్, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్ భారీ నష్టాలను చవిచూశాయి.

పతనానికి నాలుగు కారణాలు

స్టాక్ మార్కెట్ పతనానికి ప్రధానంగా నాలుగు అంశాలు కారణమయ్యాయి. మొదటి కారణం విదేశీ మదుపర్ల నిరంతర అమ్మకాలు. డిసెంబర్‌లో ఇప్పటివరకు రూ. 6,584 కోట్ల విలువైన స్టాక్స్‌ను విదేశీ సంస్థలు విక్రయించాయి. దీనిలో ఈనెల 5న ఒక్కరోజే రూ. 439 కోట్ల మేర షేర్ల ఉపసంహరణ జరిగింది. ఈ నెలలో ఇప్పటి వరకు మదుపర్లు రూ.6,584 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించారు.

రెండో కారణం.. రూపాయి విలువ పతనం. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 90.09 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటం, విదేశీ నిధులు తరలిపోవడంతో మదుపర్లలో భయాందోళనలు సృష్టించాయి. మూడో కారణం.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై సందిగ్ధత. ఈనెల 10న ఫెడ్ వడ్డీ రేట్లపై అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

సాధారణంగా 25 బేసిస్ పాయింట్ల కోత ఉంటుందని అంచనాలున్నప్పటికీ, ఆ అంచనాలకు విరుద్ధంగా నిర్ణయం వస్తే మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతుందనే భయం తో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా షేర్లను అమ్మేశారు. నాలుగో కారణం.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఎలాంటి పురోగతి లేకపోవడం, జపాన్ ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరగడం వల్ల క్యారీట్రేడ్ తిరోగమనం కూడా మార్కెట్‌ను పతనానికి దారి తీశాయి.