16 March, 2026 | 3:09 AM

డ్రగ్స్ వినియోగిస్తున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలి

16-03-2026 12:00 AM

ఎంపీ రఘునందన్ రావు

 గజ్వేల్, మార్చి15: డ్రగ్స్ వినియోగిస్తున్న ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గజ్వేల్ పట్టణంలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320-డి ఆధ్వర్యంలో నిర్వహించిన దిల్సే సిద్దిపేట రీజియన్ మీట్ ఎంపీ రఘునందన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న లయన్స్ రీజియనల్ క్లబ్బులకు ఎంపీ రఘునందన్ రావు బహుమతులు ప్రదానం చేశారు.

పేద ప్రజలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని లయన్స్ క్లబ్ సభ్యులను ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ సమాజాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులే డ్రగ్స్ అనే మహమ్మారికి బానిసలు కావడం ఆందోళనకరమన్నారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్లు, క్లబ్బుల పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్లు ఫామ్ హౌస్లపై దాడులు నిర్వహించినప్పుడు వారిపైనే గన్లతో కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోందని పేర్కొన్నారు. చట్టం ముందు ఎంపీలు, ఎమ్మెల్యేలు అనే తేడా లేదని, అందరూ సమానులేనని స్పష్టం చేశారు. డ్రగ్స్ వినియోగించిన ప్రజాప్రతినిధులపై, అలాగే ఆయుధాలను ఉపయోగించిన వారిపై ఐపీసీ 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.