16 March, 2026 | 4:25 AM

మత సామరస్యానికి, లౌకిక వాదానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది

16-03-2026 12:00 AM

రంజాన్ దావత్ ఏ ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క

ములుగు టౌన్, మార్చి 15 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వం మత సామరస్యానికి, లౌకిక వాదానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీ తక్క అన్నారు.

ఆదివారం ములుగు జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్ లో జిల్లా మైనారిటీ సం క్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు, తోఫా పంపిణీ కార్యక్రమంలో మంత్రి సీ తక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలతో సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజా ప్రభుత్వం మొదటి నుండి మత సామరస్యానికి, లౌకిక వాదానికి కట్టుబడి ఉందని, అన్ని కులాలను, మతాలను సమానంగా గౌరవిస్తూ, రాజ్యాంగం కల్పించిన లౌకిక స్ఫూర్తిని కాపాడుతుందనీ పేర్కొ న్నారు.

పాలకులు అనేవారు ప్రజలందరినీ సమానంగా చూడాలని, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలే తప్ప విద్వేషాలు రెచ్చగొట్టకూడదని హితవు పలికారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలకు, మైనార్టీ సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరూ సం తోషంగా పండుగ జరుపుకోవాలని, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని మంత్రి కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి ఎస్, గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణి, మున్సిపాలిటీ చైర్పర్సన్ చింత నిప్పుల చంద్రకళ, సంబంధిత అధికారులు, ముస్లిం మత పెద్దలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.