13-08-2025 12:00:00 AM
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో
మహబూబాబాద్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): కల్తీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో జిల్లాలోని కేసముద్రం మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల షాపును తనిఖీ చేసి ఎరువుల స్టాక్ వివరాల రిజిస్టర్ ను, ఆన్లైన్ ద్వారా కేటాయించిన స్టాక్ వివరాలు, ఎరువుల తేదీ తదితర అంశాలను ఆయన స్వయంగా పరిశీలించారు.
ప్రస్తుత సీజన్ కు అనుగుణంగా రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలని కృత్రిమ కొరత సృష్టించకూడదని డీలర్లను ఆదేశించారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే రైతుల వివరాలు సేకరించి ఎరువులను విత్తనాలను విక్రయించాలని, విక్రయించిన ఎరువులకు సంబంధించి కచ్చితంగా బిల్లు ఇవ్వాలని సూచించారు. షాపు ముందు ఎరువుల స్టాక్ వివరాల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేశారు.
వైద్య సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రస్తుతం వానకాలం సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో కలిసి పని చేయాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, మాత శిశు మరణాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్రంలో తగినన్ని మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, ప్రజలకు సీజనల్ అనుగుణంగా అందించే వైద్య కార్యక్రమాలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని సూచించారు.
కేసముద్రం మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని, డంపింగ్ యార్డ్, అంతర్గత పనులు పూర్తి చేయాలని సూచించారు. పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహాయం తీసుకుని ముందుకు సాగాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ వివేక్ తదితరులు ఉన్నారు.