14-08-2025 11:13:05 AM
ఆసుపత్రి ఎదుట బాధితుల ఆందోళన
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో(Bellampalli Government Hospital) వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మగ శిశువు మృతి చెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలానికి చెందిన కరణ్ తన భార్య సువర్ణ కు పురిటి నొప్పులు రావడంతో బుధవారం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని అడ్మిట్ చేసుకున్నారు. గురువారం ఉదయం శిశువు మృతి చెందిన వార్త తెలిసి బాలింతరాలు సువర్ణ భర్త కరణ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.
వైద్యుల నిర్లక్ష్యంతోనే నవజాత శిశువు మృతి చెందిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. మంచిర్యాలకు రెఫర్ చేయాలని కోరినప్పటికీ వైద్యులు ఇక్కడే నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి మగ శిశువు మృతికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం స్కానింగ్ కూడా చేయలేదని మండిపడ్డారు.శిశువు మృతికి కారణమైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆందోళన కొనసాగించారు.