01-09-2025 06:43:58 PM
వనపర్తి టౌన్: జిల్లాలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేయడం కానీ వినియోగించడం కానీ జరుగకుండా కట్టుదిట్టమైన నిఘా పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం ఐ.డి. ఒ సి సమావేశ మందిరంలో జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంబంధిత శాఖల నుండి నివేదిక తీసుకోవడంతో పాటు బాధ్యతలను అప్పగించారు.
మాదక ద్రవ్యాల సరఫరాపై పాఠశాలలు, కళాశాలల పరిసరాల్లో ఉన్న క్యాంటీన్ లు, పాన్ షాప్ లు, వైన్ షాపులలో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ నిఘా పెట్టాలని ఆబ్కారీ, డ్రగ్ ఇన్స్పెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన యాంటీ డ్రగ్ కమిటీలను క్రియాశీలంగా మార్చి ప్రతి నెల మొదటి శుక్రవారం యాంటీ డ్రగ్ సమావేశాలు నిర్వహించి విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు జరిగే విధంగా చూడాలని ఇంటర్మీడియట్ నోడల్ అధికారి, జిల్లా విద్యా శాఖ అధికారిని ఆదేశించారు.
స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు: డిఎస్పీ వెంకటేశ్వర రావు
2025 సంవత్సరంలో 6 కేసులు నమోదు అయినట్టు డిఎస్పీ వెంకటేశ్వర రావు తెలిపారు. ఇందులో వనపర్తి పట్టణంలో 2, గోపాల్ పేట మండల పరిధిలో 2, పెబ్బేరులో 2 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై, సరఫరా చేసే వారిపై, గంజాయి పండించే వారిపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇటీవల శిక్షణ పొందిన పోలీస్ శునకాలు మాదక ద్రవ్యాలను సులువుగా గుర్తిస్తున్నాయని వీటి సహాయంతో అనుమానం ఉన్న ప్రతి చోట తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. అనుమానం వస్తె కళాశాలల్లో ను శునకాల ద్వారా తనిఖీలు నిర్వహిస్తామని తెలియజేశారు.