2 May, 2026 | 12:24 AM

దృఢమైన బంధం

02-09-2025 12:00 AM

అమెరికా విధిస్తున్న అడ్డగోలు సుంకాల నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ చాకచక్యంగా వ్యవహరిస్తున్నది. అమెరికా సుంకాలు తప్పించుకునేందుకు భారత్ అన్వేషిస్తున్న ప్రత్యామ్నాయ మార్గాల్లో తొలి అడుగు జయప్రదమైనట్లుగా కనిపిస్తున్నది. చైనాలోని తియాన్‌జిన్ వేదికగా షాంఘై సహకార సదస్సులో (ఎస్‌సీవో) దీనికి బీజం పడింది. ఈ సదస్సులో డ్రాగన్ దేశం చైనాతో చెలిమి హస్తం అందుకున్న భారత్ అందుకనుగుణంగానే వ్యవహరించింది. ట్రంప్ వైఖరితో ఇబ్బంది పడుతున్న దేశాల్లో చైనా కూడా ఒకటి.

తమకు పోటీగా వస్తుందన్న అక్కసుతో ట్రంప్ చైనాపై 200 శాతం సుంకాలు విధించేందుకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. ఇరు దేశాల మధ్య కొన్నాళ్లు ట్రేడ్ వార్ కూడా నడిచింది. తాజాగా అమెరికా విధిస్తున్న అదనపు సుంకాల దెబ్బ భారత్, చైనాను దగ్గరకు చేరుస్తోంది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా చైనా డ్రాగన్, భారత ఏనుగు కలిసి నాట్యం చేయాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. భారత ప్రధాని మోదీ వద్ద ఉద్ఘాటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు 2026లో భారత్ ఆధ్వర్యంలో జరగనున్న బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్‌ను హాజరుకావాలని మోదీ కోరారు.  ఇద్దరు నేతల మధ్య జరిగిన సంభాషణ స్నేహగీతికను వినిపించింది. సరిహద్దు వివాదాలను పక్కనపెట్టేసి అన్ని రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించాయి.

ఇక షాంఘై సహకార సదస్సులో పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఎస్‌సీవో తీర్మానం చేయడం.. పాక్ సమక్షంలోనే ఇది జరగడం భారత్‌కు దక్కిన అతిపెద్ద దౌత్య విజయమని చెప్పొచ్చు. అయితే గత నెలలో ఎస్‌సీవోకు సంబంధించిన రక్షణ మంత్రుల సదస్సు క్వింగ్డావోలో జరిగింది. నాడు పహల్గాం ఉగ్రదాడి ఘటనను దాటవేస్తూ చేసిన సంయుక్త ప్రకటనపై నిర్మొహమాటంగా సంతకం చేయకుండా తన వైఖరిని భారత్ స్పష్టంగా చెప్పింది. ఎస్‌సీవోకు అధ్యక్షత వహిస్తున్న చైనాతో పాక్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటమే దీనికి కారణం. అయితే నేటి ఎస్‌సీవో శిఖరాగ్ర సదస్సు నాటికి పరిస్థితులు మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దుందుడుకు చర్యలతో చైనా, భారత్ సహా చాలా దేశాలు ఇబ్బంది పడ్డాయన్న మాట వాస్తవం.

ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల విదేశాంగ మంత్రులు, ప్రత్యేక ప్రతినిధులతో సరిహద్దు వివాదం పరిష్కారంలో కొంత ముందడుగు వేశారు. ఈ క్రమంలో జిన్‌పింగ్ నుంచి భారత రాష్ట్రపతికి రహస్య లేఖ వచ్చినట్లు ప్రచారం జరగడానికి తోడు ట్రంప్ బెదిరింపుల పర్వం పెరిగిపోయింది. ఇది భారత్, చైనా మధ్య స్నేహ బంధాన్ని మరింత బలంగా మార్చడంలో తోడ్పాటు అందించింది. రష్యా చమురు కొనుగోలు నేపథ్యంలో భారత్‌పై ట్రంప్ అదనపు సుంకాలు విధించడం, ఉక్రెయిన్‌తో యుద్ధం వంటి పరిణామాల వేళ  మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపేయాలని.. శాంతి మార్గంలో సమస్యను పరిష్కరించుకో వాలని రష్యాకు సూచించింది. అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని స్పష్టం చేసిన భారత్  రష్యాతో చమువు వ్యాపారం కొనసాగిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్‌తో వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని హితవు కోరి భారత్ తమ హుందాతనాన్ని ప్రదర్శించింది. మొత్తంగా భౌగోళిక రాజకీయాల్లో తియాన్‌జిన్ వేదికగా జరిగిన ఎస్‌సీవో సదస్సు అమెరికా దూకుడు చర్యకు కుదుపులా మారింది. ట్రంప్ టారిఫ్‌ల నేపథ్యంలో ప్రపంచంలో మూడు బలమైన శక్తులు విభేదాలను వీడి చేతులు కలపడం చర్చనీయాంశమైంది.