03-11-2025 04:55:55 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్..
భైంసా (విజయక్రాంతి): తానూరు మండలం బేల్తారోడా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పటిష్ట గస్తీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం తానూరు మండలం బేల్తారోడా అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో అన్ని పంటల కొనుగోలు ప్రక్రియ ప్రారంభమైనందున పక్క రాష్ట్రం నుంచి పంట అమ్మేందుకు తీసుకువచ్చే అవకాశం ఉన్నందున, నిరంతరం పటిష్ట నిఘా ఉంచాలన్నారు.
చెక్ పోస్ట్ గుండా జిల్లాలోకి ప్రవేశించే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. వాహనాల వివరాల నమోదుకు సంబంధించి రిజిస్టర్ పరిశీలించారు. తనిఖీ చేసిన వాహనాల వివరాలకు సంబంధించి రిజిస్టర్ నిర్వహించాలని చెప్పారు. ఈ తనిఖీలో బైంసా సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, పౌరసరఫరాల అధికారి రాజేందర్, మేనేజర్ సుధాకర్, తహసిల్దార్ ప్రవీణ్, ఎంపీడీవో నీరజ్ కుమార్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.