09-07-2025 12:00:00 AM
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ, జులై 8 (విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల హాజరు నమోదును ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం-ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో తప్పనిసరిగా చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మంగళవారం హనుమకొండ లోని బాసిత్ నగర్ ఉన్నత పాఠశాల, వడ్డేపల్లి లోని మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్సి), భవిత కేంద్రం (ప్రత్యేక అవసరాలు గల పిల్లల వనరుల కేంద్రం) ను జిల్లా కలెక్టర్ సందర్శించారు.
బాసిత్ నగర్, వడ్డేపల్లిలోని మండల విద్యా వనరుల కేంద్రం (ఎంఆర్సి) లలో ఉన్నత పాఠశాలలో విద్యార్థుల హాజరు, ఎఫ్‌ఆర్‌ఎస్ విధానంలో విద్యార్థుల ముఖ గుర్తింపు నమోదు, పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫాం ల గురించిన వివరాలను ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండుతున్న వంటగదిని కలెక్టర్ పరిశీలించారు. మెనూ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదాములను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం సందర్శించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాదరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.