10 July, 2026 | 2:25 AM

మోదీ హయాంలో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం

10-07-2026 01:22 AM
  1. జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ బాన్‌చిబ్
  2. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
  3. ఎల్బీనగర్‌లో విద్యార్థులతో ఛత్రోన్‌కి గూంజ్

ఎల్బీనగర్, జూలై 9 : ‘మోడీ ప్రభుత్వ వైఫల్యాలతో విద్యార్థుల భవిష్యత్ అంధకారంలోకి.. ’ఛత్రోన్ కి గూంజ్’తో యువత గొంతుకను దేశానికి వినిపిస్తాం’ అని జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ బాన్ చిబ్, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో దేశంలో నిరుద్యోగం పెరుగుతుందని విమర్శించారు. ఎల్బీనగర్ లోని రాక్ టౌన్ కాలనీలో ఒక కన్వేక్షన్ హాల్ లో గురువారం భారత జాతీయ కాంగ్రెస్ చేపట్టిన ’ఛత్రోన్ కి గూంజ్’ కార్యక్రమం నిర్వహించారు.

ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని విద్యార్థులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ బాన్ చిబ్,  మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు. జాతీయ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ బాన్ చిబ్ మాట్లాడుతూ... ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశంలో ఉద్యోగాల కంటే నిరుద్యోగుల సంఖ్య పెరగడం మోడీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

నీట్, ఇతర జాతీయ ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల నిర్వహణలో లోపాలు, నియామకాల్లో జాప్యంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకున్నా చివరకు పేపర్ లీకులతో విద్యార్థుల కష్టం వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో చోటుచేసుకున్న వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దేశవ్యాప్తంగా పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా విధానాన్ని అమలు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్ ను కాపాడాల్సిన కేంద్ర ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కూడా నమ్మకం కల్పించలేకపోయిందన్నారు. పారదర్శక నియామకాలు, లీకులు లేని పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని అన్నారు. యువత ఆశయాలను బీజేపీ ప్రభుత్వం నిరాశపరిచిందని ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో గ్రూప్ పరీక్షల లీకేజీ సైతం తెలంగాణ యువత భవిష్యత్ ను ఆగం చేసిందన్నారు.  మాజీ ఎంపీ మధుయాష్క గౌడ్ మాట్లాడుతూ.. పేపర్ లీకులు, నియామక కుంభకోణాలు బీజేపీ పాలనలో సాధారణంగా మారిపోయాయన్నారు. కష్టపడి చదివే విద్యార్థులకు న్యాయం జరగకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.

పరీక్షలు ప్రతిభను గుర్తించే వేదికగా ఉండాలే గానీ, విద్యార్థులను తిరస్కరించే వ్యవస్థగా మారడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నదని తెలిపారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జెక్కిడి శివచరణ్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల సమస్యలను దేశవ్యాప్తంగా బలంగా వినిపించేందుకే ’ఛత్రోన్ కి గూంజ్’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

పేపర్ లీకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించాలని, అన్ని పరీక్షలు, నియామకాలకు వార్షిక క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థపై అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వేషధారణలో యువజన కాంగ్రెస్ నాయకులు వినూత్న నాటికను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్లను వివరించారు. లీకులు లేని పరీక్షల నిర్వహణ, పటిష్టమైన జవాబుదారీ వ్యవస్థ ఏర్పాటు, పేపర్ లీక్ వ్యవహారాలపై సమగ్ర విచారణ, పరీక్షలునియామకాల వార్షిక క్యాలెండర్ విడుదల వంటి అంశాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు, రాష్ట్ర ఇన్ చార్జీలు ఖాలీద్, భవ్య, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.