విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి
- కలెక్టర్ కె.హరిత
కొమురం భీం ఆసిఫాబాద్, జూలై 8 (విజయక్రాంతి): ప్రభుత్వం పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు మధ్యాహ్న భోజనంలో రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. బుధవారం కాగజ్ నగర్ లోనీ పాత ప్రభుత్వ ఉన్నత ప్రధానమంత్రి శ్రీ పాఠశాలను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాలలోని మూత్రశాలలు, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, వంటశాల, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూత్రశాలలు, మరుగుదొడ్లకు వెంటనే మరమ్మత్తులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలని, కాలం చెల్లిన నిత్యవసర సరుకులను వినియోగించ కూడదని, వంటశాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్య, మౌలిక సదుపాయాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
అనంతరం పట్టణంలోని త్రిశూల్ పహాడ్ లో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్వయం ఉపాధి, క్యాంపస్ ప్లేస్ మెంట్ పై ఇస్తున్న శిక్షణను పరిశీలించారు. తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూభారతి దరఖాస్తులు, సాదా బైనమా దరఖాస్తుల ప్రక్రియ, కార్యాలయ రికార్డులు, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, కుల, ఆదాయ, నివాస వంటి వివిధ ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమాలలో నాయబ్ తహసిల్దార్ సరిత, మండల విద్యాధికారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






