దర్యాప్తు నివేదిక సమర్పించండి
- ‘సిట్’కు సుప్రీం కోర్టు ఆదేశం
- అయోధ్య ఆలయ నిధుల గోల్‌మాల్‌పై కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, జూలై ౧౩: అయోధ్యరామ్‌మందిర నిధుల దుర్వినియోగం కేసులో ఇప్పటివరకు చేపట్టిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీం కోర్టు ఆదేశించింది. నివేదికలో సిట్ సభ్యుల పేర్లు కూడా ఉండాలనీ సూచించింది. అలాగే, నిధుల దుర్వినియోగంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో దర్యాప్తు చేయించాలని అడ్వొకేట్ నరేంద్రకుమార్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వంతోపాటు శ్రీరామజన్మభూమి ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది.
సీబీఐ దర్యాప్తు చేపట్టాలని దాఖలైన పిటషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ మోహనతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తొలుత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు.
దర్యాప్తునకు సంబంధించిన స్టేటస్ కో నివేదికను సీల్డ్ కవర్‌లో న్యాయస్థానానికి సమర్పిస్తామని తెలిపారు. నిధుల దుర్వినియోగం విషయంలో శ్రీరామజన్మభూమి ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేయడాన్ని కాస్త వాయిదా వేయాలని కోరగా, ధర్మాసనం అందుకు నిరాకరించింది. అలాగే, ఈనెల ౨౦లోపు సిట్ నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ, అదే రోజుకు విచారణను వాయిదా వేసింది.






