14 July, 2026 | 4:49 AM

రగులుతున్న పశ్చిమాసియా

14-07-2026 12:00 AM
  1. ఇరాన్- అమెరికా మధ్య భీకర పోరు
  2. గల్ఫ్ దేశాల్లోని అగ్రరాజ్య స్థావరాలు ఇరాన్ టార్గెట్
  3. ఇరాన్‌లోని క్షిపణి, వైమానిక వ్యవస్థలపై అమెరికా క్షిపణులు 
  4. పలు నగరాలపై బాంబుల వర్షం.. పలువురి మృతి 

వాషింగ్టన్/టెహ్రాన్, జూలై ౧౩: అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాలు సోమవారం పరస్పరం క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకు న్నాయి. ఇరాన్ క్షిపణి వ్యవస్థలు, వైమానిక రక్షణ కేంద్రాలు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ స్పీడ్‌బోట్లను టార్గెట్ చేసి అమెరికా దాడులు చేసింది. ఇరాన్‌లోని కీలక నగరాలతోపాటు క్విష్మ్ ద్వీపంపైనా క్షిపణుల వర్షం కురిపించింది.

ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే.. అమె రికా మాత్రం అందుకు భిన్నమైన ప్రకటన విడుదల చేసింది. జలసంధి ఎల్లప్పుడూ తమ నియంత్రణలో తెరిచే ఉంటుందని ప్రకటించింది. ఈ ప్రకటనను ఇరాన్ నాయ కత్వం తీవ్రంగా ఖండించింది. తమ అనుమతి లేకుండా నౌకలు ముందుకు కదిలితే పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

దీనిలో భాగంగానే రెండు నౌకలపై దాడులు సైతం చేసిం ది. అమెరికాకు సహకారం అందించే దేశాలు తమకు శత్రువులేనని, అందుకే.. గల్ఫ్ దేశాల్లోని అమెరికన్ సైనిక స్థావరాలను టార్గెట్ చేస్తున్నామని స్పష్టం చేసింది. దీనిలో భాగంగానే జోర్డాన్‌లోని అమెరికా కమాండ్- అండ్ -కంట్రోల్ కేంద్రాలు, డ్రోన్ హ్యాంగర్లను ధ్వంసం చేసింది. కువైట్‌లోని అమెరికన్ రాడార్ కేంద్రం, హిమార్స్ క్షిపణి లాంచర్ వ్యవస్థలు, మందుగుండు సామగ్రి నిల్వ కేంద్రాలపై దాడులకు పాల్పడింది.

ఒమన్‌లోని ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సపోర్ట్ ప్లాట్‌ఫామ్స్‌పై, ఖతార్‌లోని జెట్ ఫైటర్ మెయింటెనెన్స్ కేంద్రాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఖతార్‌లో క్షిపణి శకలాలు పడి ఒక చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారు. మరోవైపు, అమెరికా కూడా హోర్ముజ్ పరిసరాల్లోని ఇరాన్ ప్రాంతాలపై దాడులు చేసినట్టు ప్రకటించింది. దాడుల కారణంగా బందర్ అబ్బాస్, జాస్క్, సిరిక్, ఖెష్మ్ దీవి, చాబహార్ ప్రాంతాల్లోనూ పెద్ద పేలుళ్లు సంభవించాయి.

దాడుల కారణంగా అబాదాన్ నగరంలో ఇద్దరు మృతిచెందారు. ఇస్ఫహాన్‌లో ఒకరు మృతి చెందగా, ఏడుగురు క్షతగాత్రులయ్యారు. నైన్‌కౌంటీ పట్ట ణంలో ఒకరు మరణించారు. మహష్‌హర్‌లోని ఒక నీటి పంపింగ్ కేంద్రంపై జరిపిన దాడిలో ఒకరు మరణించారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హోర్ముజ్ ఇరాన్ ప్రయోగించిన ఒక క్షిపణిని, ఒక ఆత్మాహుతి డ్రోన్‌ను కూల్చివేసినట్లు అమెరికన్ సైన్యం ప్రకటించింది.

పెరిగిన క్రూడాయిల్ ధరలు

హోర్ముజ్ మూసివేత ప్రభా వం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై పడింది. ఆదివారం కేవలం ఆరు నౌకలు మాత్రమే జలసంధిని దాటాయి. ప్రపంచ ఇంధన సరఫరా నిలిచిపోతుందనే ఆందోళనల మధ్య ముడిచమురు (క్రూడాయిల్) ధర లు సోమవారం ఒక్కరోజే ౩ శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ ముడిచముర ధర 77.68 డాలర్లకు చేరింది. అమెరికా దాడు లు, దిగ్బంధం కారణంగా ఇరాన్ చమురు ఎగుమతులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.