రైతుల యాతన
పత్తి విత్తనాల కోసం అన్నదాతల ప్రయాస
ఫెర్టిలైజర్ షాపుల ముందు గంటల కొద్దీ పడిగాపులు
ఆదిలాబాద్‌లో వరుసగా మూడోరోజూ ఉద్రిక్తత
గంటల కొద్దీ క్యూ లైన్లలో బారులు తీరినా చాలినన్ని విత్తనాలు లభించడం లేదని రైతన్న రంది పడుతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం డిమాండ్‌కు తగిన విత్తనాలు అందుబాటులో ఉంచామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం విత్తనాలు అందుబాటులో లేవని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కడుపు మండి రాస్తారోకోలు, ధర్నాలు చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో వరసగా మూడోరోజూ రైతులు నిరసన వ్యక్తంచేశారు.
ఆదిలాబాద్, మే 30 (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత రోజురోజుకు రైతులను కలవరపరుస్తున్నది. నిన్న, మొన్నా క్యూలైన్లలో బారులు తీరి కొందరు రైతులు చేతికి అందిన విత్తన ప్యాకెట్లను వెంట తీసుకెళ్లారు. గురువారం జిల్లాకేంద్రానికి వచ్చిన రైతులు మాత్రం ఇక్కడ డిమాండ్ ఉన్న విత్తనాలను డీలర్లు మహారాష్ట్రకు తరలిస్తున్నారని, తద్వారా విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ఆగ్రహానికి గురై జిల్లాకేంద్రంలోని కిసాన్ చౌక్ పాత జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇదే క్రమంలో ఓ ట్రేడర్స్ వ్యాన్‌లో 160 రాశి 659 పత్తి విత్తన బ్యాగులను ఇచ్చోడకు తరలిస్తున్నారని భావించిన రైతులు ఆ వాహనాన్ని అడ్డుకున్నారు. ఎండలో తాము క్యూ లైన్‌లో నించుంటే వ్యాన్‌లో విత్తనాలు తరలించడం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం వ్యాన్ టైర్‌లో గాలిని తీశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. సమాచారం అందుకున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, పోలీస్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు
నిర్మల్ మే 30: ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా, లేదా ప్రోత్సహించినా వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి విత్తన డీలర్లు, పోలీస్ అధికారులు, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో విత్తనాల కొరత లేదని, రైతులు సమయనం పాటించి విత్తనాలు తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. డీలర్లు అధిక ధరలకు విత్తనాలు విక్రయిస్తే దుకాణ లైసన్సును రద్దు చేస్తామన్నారు. అవసరమైతే యాజమానులపై పీడీ యాక్టులు నమోదుచేస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.
రికార్డులు పక్కాగా ఉండాలి
కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 30: విత్తన డీలర్లను స్టాక్ వివరాలను పక్కాగా నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయశాఖ, పోలీస్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దుకాణంలోని స్టాక్ బోర్డులో ఏరోజుకా రోజు వివరాలు నమోదు చేయాల్సిందేనన్నారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాన్ని అడ్డుకునేందుకు రెండు టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏడు కేసులు నమోదు కాగా వెయ్యి క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సమావేశంలో ఏఎస్పీ ప్రభాకర్‌రావు, డీఏవో శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.
విత్తన షాపుల్లో ముమ్మర తనిఖీలు
వరంగల్ తూర్పు, మే 30: వరంగల్ నగరంలోని స్టేషన్‌రోడ్డులో గల పలు విత్తనాల షాపుల్లో ఇంతేజార్‌గంజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సీఐ మచ్చ శివకుమార్ స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. పత్తి విత్తనాల లభ్యతపై ఆరా తీశారు. నిర్ధేశించిన ధరలకే విత్తనాలు, ఎరువులు విక్రయించాలని సూచించారు. రైతులకు తప్పనిసరిగా ఇన్‌వాయిస్‌లు ఇవ్వాలని తెలిపారు.
బెల్లంపల్లిలో రికార్డులు పరిశీలన
బెల్లంపల్లి, మే 30: బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ ఫెర్టిలైజర్ దుకాణంలో వ్యవసాయాధికారి వందన ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం సోదాలు చేపట్టింది. స్టాక్ నిల్వలు, ఇన్వాయిస్, రిజిస్టర్‌లను పరిశీలించి, ఎమ్మార్పీ రేటుకే విక్రయించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తనిఖీల్లో బెల్లంపల్లి వన్‌టౌన్ ఎస్‌ఐ సురేష్, ఆర్‌ఐ విజయల, ఏఈవో నాగదీప్తి పాల్గొన్నారు.
అగ్రిమాల్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
జనగామ, మే 30: జనగామ పట్టణంలోని జేకేఎస్ అగ్రిమాల్‌లో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వినోద్‌కుమార్‌తో కలిసి రిజిస్టర్లను పరిశీలించారు. పత్తి రైతులతో మాట్లాడారు. ధరలపై ఆరా తీశారు. లైసెన్స్ కలిగిన షాపుల్లోనే విత్తనాలు కొనాలని రైతులకు సూచించారు. సాయంత్రం డీసీపీ సీతారాం సైతం ఇదే షాపులో తనిఖీ చేపట్టడం గమనార్హం.
ఐదు క్వింటాళ్ల నకిలీ విత్తనాల పట్టివేత
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 30 (విజయక్రాంతి): బూరుగూడ సమీపంలో గురువారం పోలీసులు ఐదు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానేపల్లి మండలం గూడేనికి చెందిన ప్రశాంత్ నకిలీ విత్తనాలను లక్షెట్‌పేట నుంచి తీసుకువచ్చి, రైతులకు విక్రయించేందుకు సిద్ధమవుతున్నాడు.
బురుగూడ సమీపంలో వ్యవసాయ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేస్తుండగా ప్రశాంత్ వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేశారు. తనిఖీల్లో 50 కిలోల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. నిందితుడి అదుపులోకి తీసుకుని విచారించగా మరో 4.5 క్వింటాళ్ల విత్తనాలు దాచిన ప్రదేశం చెప్పాడు. పోలీసులు ఆయా స్థావరాల్లో మొత్తం రూ.12.50 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.






