06-12-2024 12:54:04 AM
సంగారెడ్డి, డిసెంబర్ 5 (విజయక్రాంతి): చెరకు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఫ్యాక్టరీల పరిధిలో సీడీసీ(చెరకు అభివృద్ధి కమిటీ)లను నియమిస్తుంది. అయితే సంగారెడ్డి జిల్లాలోని సీడీసీ పాలకమండలి కమిటీలు చెరకు రైతుల సమస్య లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
సాగుపై అనుభవంలేని వ్యక్తులకు పదవులు ఇవ్వడంతో రైతులకు మేలు కలగడం లేదన్న విరమర్శలు వినిపిస్తున్నాయి. సీడీసీ చైర్మన్‌తోపాటు సభ్యులు చెరకు రైతులు, ఫ్యాక్టరీలకు మధ్య సంధానకర్తలుగా పనిచేయాలి. అయితే సీడీసీ కమిటీలో నియామకం చేసే వ్యక్తికి చెరకు పంట సాగుపై అనుభవం ఉండాలి. ఫ్యాక్టరీలకు చెరకును సరఫరా చేసినా.. సకాలంలో బిల్లులు చెల్లించకపోయినా.. యాజమాన్యంతో పాలకమండలి సమావేశమై రైతుల సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది.
చెరకు క్రష్షింగ్ షురూ..
జిల్లాలోని జహీరాబాద్ ప్రాంతంలో చెరకు పంటను అధికంగా సాగు చేస్తుండగా.. సంగారెడ్డి సమీపంలోని ఫసల్వాది గ్రామంలో గణపతి చక్కెర ఫ్యాక్టరీ, జహీరాబాద్ మండలం కొత్తూర్(బి)లో ట్రైడెంట్, రాయికోడ్ మండలం మాటూర్ శివారులో గోదావరి గంగా, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో మార్గి చక్కెర ఫ్యాక్టరీలు ఉన్నాయి.
2024 సీజన్‌కు సంబంధించి చెరకు క్రష్షింగ్‌ను సంగారెడ్డి గణపతి, రాయికోడ్ గోదావరి, మార్గి ఫ్యాక్టరీల్లో ప్రారంభమైంది. రెండేళ్లుగా ట్రైడెంట్ ఫ్యాక్టరీలో చెరకు క్రష్షింగ్ చేయడం లేదు. దీంతో ప్రభుత్వం ఫ్యాక్టరీ జోన్‌ను తగ్గించింది. గతంలో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్‌కల్, ఝరాసంగం, రాయికోడ్ మండలాలు క్రష్షింగ్ జోన్ పరిధిలో ఉండగా.. 2024-25 సీజన్‌లో ట్రైడెంట్ షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో జహీరాబాద్, మొగుడంపల్లి మండలాలను ఉంచారు.
రాయికోడ్ మండలంలోని మాటూర్‌లో ఏర్పాటు చేసిన షుగర్స్ ఫ్యాక్టరీ పరిధిలో కోహీర్, ఝరాసంగం, న్యాల్‌కల్, రాయికోడ్, వట్‌పల్లి మండలాలను చేర్చారు. జహీరాబాద్, మొగుడంపల్లి మండలంలో ఉన్న చెరకును సంగారెడ్డి గణపతి ఫ్యాక్టరీతోపాటు కామారెడ్డి, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని షుగర్ ఫ్యాక్టరీలకు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
ఒక శాతం పన్ను సీడీసీలకు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం షుగర్స్ ఫ్యాక్టరీలు క్రష్షింగ్ చేసిన చెరకుపై 1--2 శాతం వరకు పన్ను వసూలు చేసి సీడీసీలకు ఇవ్వాలి. ఈ పన్నులతో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ చేస్తారు. రైతులకు చెరకు సాగులో ఉపయోగపడే రసాయన మందులు, ఎరువులు, పైపులను పంపిణీ చేస్తారు.
దీంతో పాటు సాగు విధానంలో మార్పులను వివరించేందుకు ఇతర ప్రాంతాలకు (ఫీల్డ్ ట్రిప్)తీసుకెళ్తారు. అధిక దిగుబడులు సాధించే దిశగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. ఆ దిశగా సీడీసీలు చర్యలు తీసుకోవడం లేదు. సబ్సిడీపై పరికరాలు, రసాయన ఎరువుల పంపిణీ చేయడం లేదు.
సీడీసీ కార్యాలయంలో రికార్డులు తయారు చేసి నిధులు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరకు పంట సాగుపై అనుభవం లేని వారికి పదవులు ఇవ్వడంతో తమకు అన్యాయం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. తమ కష్టాలు తెలియని వ్యక్తులకు పదవులిస్తే ఏమి మేలు చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.