03-05-2025 11:33:54 PM
పటాన్ చెరు (విజయక్రాంతి): ఐడిఏ బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని డిజైర్ సొసైటీలో సమ్మర్ క్యాంప్ శనివారం ప్రారంభమైంది. అమెరికన్ కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ ఆర్ పి పట్నాయక్, సినీ యాక్టర్ జెమినీ సురేష్ డిజైర్ సొసైటీ ఫౌండర్ డైరెక్టర్ రవిబాబుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అమెరికన్ కౌన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మాట్లాడుతూ... అనాధ హెచ్ఐవి ఎయిడ్స్ బాధిత పిల్లలకు డిజైర్ సొసైటీ అండగా నిలవడం అభినందనీయమని అన్నారు.
గత 19 సంవత్సరాలుగా అనాధ హెచ్ఐవి, ఎయిడ్స్ బాధిత పిల్లలకు డిజైర్ సొసైటీ సేవలందిస్తుండడం ఆనందంగా ఉందని డిజైర్ సొసైటీ ఫౌండర్, డైరెక్టర్ రవిబాబు అన్నారు. డిజైర్ సొసైటీ అందిస్తున్న సేవలను జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి రత్నం అభినందించారు. ప్రత్యూష ఫౌండేషన్ తరపున విరాళాన్ని ప్రముఖ సినిమా నటుడు సుమంత్ సొసైటీ ప్రతినిధులకు అందజేశారు. అనంతరం విద్యార్థులకు డాల్ క్యారెక్టర్స్, మ్యాజిక్ షో, మ్యూజికల్ చైర్, ఫ్యాషన్ షో తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రాజ్ కుమార్, సునీల్ కుమార్, డిజైర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మర్ క్యాంప్ ఐదో తేదీ వరకు జరగనుంది.