14 July, 2026 | 3:35 AM

చదువు నేర్పిన బడికి తోడ్పాటు

14-07-2026 12:05 AM

మరిన్ని ప్రభుత్వ పాఠశాలకు ఆదర్శం 

అత్యంత ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు ప్రోత్సాహం 

ములుగు, జూలై 13 (విజయక్రాంతి): ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని పసర జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు పూర్వ విద్యార్థులు అద్భుతమైన సహకారాన్ని అందిస్తున్నారు. తాము చదువుకున్న విద్యా దేవాలయాన్ని పచ్చని నందనవనంగా తీర్చిదిద్దడమే కాకుండా, అక్కడ చదివే నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే ధ్యేయంగా పస్రా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్భుతమైన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లా వ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

2026 విద్యా సంవత్సరానికి పదవ తరగతి పరీక్షల్లో అత్యంత మెరుగైన ఫలితాలు సాధించి పాఠశాల కీర్తిని దశదిశలా చాటిన ప్రతిభావంతు రాలైన విద్యార్థిని కొత్త శృతిరెడ్డిని పూర్వ విద్యార్థుల సంఘం ఘనంగా సన్మానించారు. అంతేకాకుండా ఆమె ఉన్నత చదువు లకై భారీ ఆర్థిక సాయాన్ని అందజేశారు. పాఠశాల విద్యార్థుల్లో ఉన్నత ఆశయాలను, పోటీ తత్వాన్ని పెంచేందుకు పూర్వ విద్యార్థుల సంఘం తరఫున ప్రతి ఏటా ఇచ్చే ప్రోత్సాహకాలలో భాగంగా ఈ సంవత్సరం టాప్ మార్కులు సాధించిన కొత్త శృతి రెడ్డిని సంఘం పెద్దలు ప్రశంసించారు.

విద్యార్థిని ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో సంఘ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నగదు బహుమతిని అందజేశారు. పూర్వ విద్యార్థుల సంఘం గౌరవ సభ్యులు పైళ్ల శ్రీనివాస రెడ్డి విద్యార్థిని ప్రతిభను అభినందిస్తూ 5,012 ఆర్థిక సాయాన్ని అందజేశారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్ బాబు విద్యార్థిని భవిష్యత్తుకు భరోసానిస్తూ 10,116 ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థిని కొత్త శృతి రెడ్డి ని పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో మెమెంటోతో ఘనంగా సన్మానించడం జరిగింది.

అంతేకాకుండా పాఠశాల ఆవరణలో పచ్చని తోరణంతో పాటు అద్భుతమైన పూల తోట ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్ బాబు, ప్రత్యేక అతిధి బద్దం సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల అంటే కేవలం నాలుగు గోడల మధ్య జరిగే చదువు మాత్రమే కాదు, అది ఒక మధురమైన జ్ఞాపకం అని పేర్కొన్నారు. కాంక్రీట్ వనంగా మారుతున్న నేటి సమాజంలో పర్యావరణ పరిరక్షణను బాధ్యతగా స్వీకరిస్తూ పాఠశాల ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి, సుందరమైన పూల తోటను (గార్డెనింగ్) ఏర్పాటు చేశామని వివరించారు.

ఆహ్లాదకరమైన వాతావరణం రంగురంగుల పూల మొక్కలు, వాటి సువాసనలు విద్యార్థులలో మానసిక ఒత్తిడిని తగ్గించి, చదువుపై ఏకాగ్రతను పెంచుతాయని, ఉదయాన్నే పాఠశాలలోకి అడుగుపెట్టగానే పలకరించే పచ్చదనం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. పుస్తకాల్లో చదివే పర్యావరణ పాఠాల కంటే కళ్లముందు కనిపించే ఈ పచ్చదనమే విద్యార్థులకు గొప్ప గుణపాఠం అని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను దత్తత తీసుకుని పెంచేలా ఈ గార్డెన్ స్ఫూర్తిని నింపుతోందని వారు తెలిపారు. మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడం కూడా అంతే ముఖ్యం అనే సందేశాన్ని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

పస్రా జెడ్.పి.హెచ్.ఎస్. పూర్వ విద్యార్థుల సంఘం చేపడుతున్న ఈ పర్యావరణ హిత కార్యక్రమాలు మిగిలిన పాఠశాలల సంఘాలకు ఒక దిక్సూచి లాంటివని, తాము ఎదిగిన ఒడిని మరువకుండా సమాజానికి మేలు చేయడం అందరి బాధ్యత అని వారు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు కాట్రగడ్డ సతీష్, కార్యదర్శి బొబ్బ క్రాంతి కుమార్, కోశాధికారి బీరెడ్డి సాంబశివ, కార్యనిర్వహక అధ్యక్షులు బద్దం సుదర్శన్ రెడ్డి. గౌరవ అధ్యక్షులు సూడిశ్రీనివాస్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు గోల్యాల నర్సిరెడ్డి, ఉపాధ్యక్షులు ఉప్పుతల కోటి, ఉపాధ్యక్షులు పొదిళ్ళ చిట్టిబాబు, ప్రచార కార్యదర్శి మద్దినేని రామరాజు, సంయుక్త కార్యదర్శి కర్ర సాంబశివుడు, సంయుక్త కార్యదర్శి ఎండి. అజీజ్, సభ్యులు సమర్ధపు క్రాంతి, బొమ్మకాని శ్రీను, శ్రీపాల ప్రధానోపాధ్యాయులు శ్రీనవాస్, సమ్మేశ్వరావు, డి.సమ్మయ్య, జయశ్రీ, చంద్రారెడ్డి, డి రాజయ్య, సిహెచ్ వెంకటేశ్వర్లు, వై కవిత, భిక్ష రాథోడ్, సప్పిడి సతీష్ తదితరులు పాల్గొన్నారు