20-05-2025 03:10:08 AM
హైదరాబాద్, మే 19 (విజయక్రాంతి)/చార్మినార్: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాద ఘటనపై చార్మినార్ పోలీసుల కేసు నమో దు చేశారు. ప్రమాదంపై అనుమానాలున్నాయంటూ మృతుల బంధువు ఉత్కర్ష్ మోడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 6:10 నిమిషాలకు తన తండ్రి వినోద్ మోడీకి అత్యవసరంగా రావాలని రాహుల్ ఫోన్ చేశాడని ఉత్కర్ష్ మోడీ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నాడు.
కాల్ అందుకున్న వెంటనే తన తండ్రితో కలిసి గుల్జర్ హౌస్ వెళ్టినట్టు చెప్పారు. అప్పటికే భవనం గ్రౌండ్ తో పాటు రెండో అంతస్తులో మంటలు వ్యాపిస్తున్నాయని, అప్పటికే అక్కడ ఉన్నవారు, అగ్నిమాక శాఖ, డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయని పేర్కొన్నారు. కొందరు బాధితులను వేరియస్ హాస్పిటల్‌కు తరలించారని చెప్పారు. ఈ మేరకు అగ్నిప్రమాద ఘటనపై క్షుణ్ణంగా విచారణ జరపాలని ఉత్తర్ష్ మోడీ ఫిర్యాదులో పోలీసులను కోరారు.
జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం!
చార్మినార్ ప్రాంతంలో వాణిజ్య సముదాయాలు నిత్యం పర్యాటకులు, కొనుగోలు దారులతో కిటకిటలాడుతుంటాయి. ఇలాం టి ప్రదేశంలో వ్యాపార సముదాయాలు, ఇళ్లు పిట్టగూడు మాదిరిగా ఇరుకైన సందు ల్లో నిర్మిస్తున్నారు. అయినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. అంతే కాకుండా లంచం ఇస్తే చాలు నిర్మాణంలో లోపాలు ఉన్నా అనుమతులు ఇచ్చేస్తున్నారు అని తెలుస్తోంది. అగ్నిప్రమాదాలు సంభవిస్తే తీసుకునే జాగ్రత్తలపై అధికారులు దృష్టి పెట్టడం లేదు.
కేసును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
గుల్జార్ హౌజ్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించింది. భవనం భద్రత, విద్యుత్ నిర్వహణ, అగ్నిప్రమాద నివారణ నిబంధనలు పాటించలేదని మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించినట్లు కమిషన్ తెలిపింది. 17 మంది మృతిపై జూన్ 30లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డీజీ, టీఎస్‌పీస్‌డీసీఎల్ చీఫ్ ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేసింది.