చెత్త విభజనతోనే స్వచ్ఛ హుస్నాబాద్
మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మీకొమురయ్య
హుస్నాబాద్, ఏప్రిల్ 15: హుస్నాబాద్ పట్టణంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 17వ వార్డ్లో చెత్త విభజన, హోమ్ కంపోస్టింగ్, ప్లాస్టిక్ నిషేధం వంటి అంశాలపై అవగాహన సదస్సు పురపాలక సంఘ చైర్పర్సన్ శ్రీమతి దండి లక్ష్మీ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ దండి లక్ష్మీ మాట్లాడుతూ ఇంటి నుండి వెలువడే చెత్తను నాలుగు రకాలుగా వేరు చేసి మున్సిపల్ వాహనానికి అందించాలని సూచించారు. డ్రైనేజీల్లో చెత్త వేయకూడదని, చెత్తను వేరు చేసి ఇవ్వడం ప్రతి ఇంటి బాధ్యత అని పేర్కొన్నారు. అలాగే నిల్వ నీటిని తొలగిస్తూ శుభ్రత పాటించాలని, సెప్టిక్ ట్యాంకులను ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శుభ్రం చేయించుకోవాలని సూచించారు.
ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానుకుని, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకులను వినియోగించుకోవాలని సూచించారు. వార్డు కౌన్సిలర్ గాదెపాక రవీందర్ మాట్లాడుతూ చెత్తను వేరు చేయకపోవడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాల ఎల్లం, పర్యావరణ అధికారి రవికుమార్, బసిల్ ఫౌండేషన్ సూపర్వైజర్ నవీన్, ఇన్చార్జి వార్డ్ ఆఫీసర్లు సతీష్, శ్రీకాంత్, వార్డ్ ఆర్పి రజితతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల్లో శుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కీలకమని స్థానికులు అభిప్రాయపడ్డారు.






