15 July, 2026 | 12:32 PM

Breaking News

లిబర్టీ చౌరస్తాలో తాచుపాము

08-06-2024 01:54 AM

ట్రాఫిక్ సిగ్నల్ కేబుల్‌పై దర్శనం

వీడియోలకు ఎగబడిన జనంతో ట్రాఫిక్ జాం

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : హిమాయత్‌నగర్ లిబర్టీ చౌరస్తాలో శుక్రవారం ఓ తాచుపాము కలకలం సృష్టించింది. ఎవరూ ఊహించని విధంగా చౌరస్తా వద్ద ఉన్న వేపచెట్టుపై ఓ పాము ప్రత్యక్షం అయింది. దీంతో వామ్మో పాము అని పలువురు వాహనదారులు ఉలిక్కిపడగా.. మరికొందరు ఎక్కడికక్కడ తమ వాహనాలను నిలిపి సెల్‌ఫోన్లతో పామును వీడియోలు తీయడానికి ఎగబడ్డారు. గంటసేపయినా పాము కిందకు దిగక పోవడంతో లిబర్టీ చౌరస్తాలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వివరాలిలా ఉన్నాయి.

లిబర్టీ చౌరస్తా వద్ద ఉన్న ఓ  వేపచెట్టుపై నుంచి కేబుల్‌వైర్ల ద్వారా ట్రాఫిక్ పోల్ వైపు పాము వచ్చింది. అది కిందకు దిగకపోవడంతో అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు కూడా అక్కడకు చేరుకోవడంతో చౌరస్తాలో భారీగా ట్రాఫిక్‌జాం అయింది. ఎట్టకేలకు సిగ్నల్ పోల్ నుంచి కిందకు దిగిన పాము పక్కనే ఉన్న ఓ ఖాళీ బిల్డింగ్ సెల్లార్‌లోకి వెళ్లిపోయింది. దీంతో పోలీసులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.