10-12-2025 07:53:00 PM
టిజీబి ఆర్ఎం బాలచంద్ర..
నస్పూర్ (విజయక్రాంతి): తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో వినియోగదారులకు అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని టి జి బి రీజనల్ మేనేజర్ బాలచంద్ర పట్కి కోరారు. బుధవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు సీతారాంపల్లి శాఖ ప్రారంభించి 41 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శాఖ నిర్వహణ అధికారి నరసింహ స్వామి ఖాతాదారులతో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. సీతారాం పల్లి శాఖ ఖాతాదారుల మన్ననలను అందుకొంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రస్తుతం డిపాజిట్లపై అత్యధిక వడ్డీ లభిస్తుందని, ఖాతాదారులు తమ ఆర్థిక నిల్వలను బ్యాంకులో డిపాజిట్ చేసుకొని ఈ సౌలభ్యాన్ని వినియోగించుకొని ఆర్థిక పురోభివృద్ధి సాధించుకోవాలన్నారు. బ్యాంకు ద్వారా అందించే వ్యవసాయ రుణాలు, వ్యవసాయ సంబంధిత రుణాలు, మహిళా సంఘాలకు రుణాలు, ఇంటి నిర్మాణము కొనుగోలు రిపేర్లకు రుణాలు, బంగారంపై వ్యవసాయ వ్యవసాయేతర అవసరాలకు రుణాలు అర్హత కలిగిన వారు తీసుకొని తమ కలలను నిజం చేసుకొని ఆర్థికపరంగా పురోభివృద్ధి సాధించాలన్నారు.
మ్యూచువల్ ఫండ్ లు, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాలు, ప్రమాద బీమా పథకాలు, అటల్ పెన్షన్ యోజన పథకం మొదలైనవెన్నో కలవని, బ్యాంకు ఖాతా కలిగిన ప్రతి ఖాతాదారుడుపై వాటిలో అర్హత కలిగిన అన్ని పథకాల యందు చేరి తమ భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సుస్థిరం చేయడం కోసం తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలందిస్తుందని, వాటిని అందుకొని శాఖ పరిధిలోని ఖాతాదారులు ఆర్థిక అభివృద్ధి సాధించి సమాజంలో గొప్ప గౌరవాన్ని పొందాలన్నారు. ఇన్సూరెన్స్ పథకాలలో బ్యాంకు ద్వారా చేరిన వారికి క్లెయిముల సమయంలో శాఖ ప్రతినిధులు సహాయ సహకారాలు అందించి వాటి పరిష్కారంలో చొరవ చూపగలరని తెలిపారు.
ఈ మధ్యకాలంలో సీతారాంపల్లి శాఖ నుండి అపర్ణ గారికి హెల్త్ ఇన్సూరెన్స్ పథకం ద్వారా హాస్పిటల్ ఖర్చులు చెల్లించడం జరిగిందని, ఇంకా ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ చేయబడిన వ్యక్తి దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబ సభ్యులకు 10 లక్షల 27 వేల రూపాయలు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా ఇవ్వడం జరిగిందని తెలిపారు. బ్యాంకు ద్వారా వివిధ పథకాలలో వందల రూపాయల నుండి కోట్ల రూపాయల వరకు తమ కష్టార్జితాన్ని ఉంచుకొని మరింత అద్భుతమైన ఆర్థిక అభివృద్ధిని భవిష్యత్తులో సాధించుకోవచ్చునని, ఇందు కోసం ఎన్నో పథకాలు తెలంగాణ గ్రామీణ బ్యాంకు సిద్ధం చేసిందని వాటిని వినియోగించుకొనుట కొరకు సీతారాంపల్లి శాఖ సిబ్బందిని సంప్రదించడం వల్ల ఖాతాదారుల ఆర్థిక పురోభివృద్ధి నిరంతరం జరుగుతూ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారి నాగరాజు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, ఖాతాదారులు రామన్న, ధర్మయ్య, కనకయ్య, మల్లేష్, రాజన్న, సంతోష్ కుమార్, బాపురెడ్డి, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.