03-05-2025 07:16:05 PM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్...
మంచిర్యాల (విజయక్రాంతి): వేసవి సెలవులలో విజ్ఞానంతో పాటు వినోదాన్ని అందిస్తూ పాఠ్య, పాఠ్యేతర అంశాలను అందిస్తున్న వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి బాలికల వేసవి శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... వేసవిలో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్, స్పీడ్ మాథ్స్, డాన్స్, మ్యూజిక్, యోగ, మెడిటేషన్, కంప్యూటర్ కోడింగ్, పెయింటింగ్ మొదలైన అంశాలలో శిక్షణ అందించేందుకు శిబిరం ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
శారీరక, మానసిక ఎదుగుదలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుందని, ఈ నెల 17 వరకు 15 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. ఒక బృందం, వ్యవస్థను సమర్థవంతంగా నడిపించే వ్యక్తి నాయకుడని, విద్యార్థులు చిన్నతనం నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని అన్నారు. క్రీడలు, ఇతర రంగాలలో జట్టులో ఉన్న సభ్యులందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే విజయం సాధించవచ్చని అన్నారు. ప్రతి రోజు కొత్త విషయాలను నేర్చుకోవాలని, వేసవి శిక్షణ శిబిరాలలో విద్యార్థులకు కొత్త విషయాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. మనం నేర్చుకునే అంశాలను నిశితంగా పరిశీలిస్తే విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని, ప్రజా ప్రయోజనకరంగా వినూత్న ఆవిష్కరణలు రూపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు.
ఒక సమస్యను అనేక దారులలో పరిష్కరించవచ్చని, చివరగా పూర్తి స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యమని అన్నారు. క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం ఇతర రంగాలలో ప్రయత్నించడమే తొలి విజయమని, ఏకాగ్రత, ఇష్టంతో నేర్చుకుంటే నైపుణ్యత సాధించవచ్చు అని అన్నారు. ఏ అంశంలోనైనా నిరంతరం ప్రయత్నిస్తుంటే ఆ రంగంలో రాణించవచ్చని, ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే క్రమశిక్షణ, చిత్తశుద్ధితో ప్రయత్నించాలని తెలిపారు. జిల్లాలోని 18 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల నుండి దాదాపు 200 మంది విద్యార్థినులను తీసుకురావడానికి ప్రత్యేక అధికారులు, ఉపాధ్యాయులు చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, నస్పూర్ మండల విద్యాధికారి దామోదర్ రావు, శిబిరం సమన్వయకర్త, నస్పూర్ ప్రత్యేక అధికారి మౌనిక సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.