03-05-2025 07:18:42 PM
మంత్రి సీతక్క...
విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన...
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో పోడు భూములు సాగు చేసుకుని పట్టాలు పొందిన రైతుల సాగు భూములకు కరెంటు కష్టాలు కడ తెరనున్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. నాలుగు కోట్ల వ్యయంతో బత్తులపల్లి, కోమట్ల గూడెం గ్రామాల్లో నూతనంగా నిర్మించనున్న 33/11 కె.వి విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ... ఇవే కాకుండా గిరిజన ప్రాంతంలో లోఓల్టేజీ సమస్య పూర్తిగా తొలగించడానికి 75 కోట్లతో మడ గూడెంలో 132/33 కేవి విద్యుత్ ఉపకేంద్రాన్ని మంజూరు చేయించి కరెంటు కష్టాలను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు.
అలాగే మొండ్రాయి గూడెం, కామారం ప్రాంతాల్లో కొత్తగా విద్యుత్ ఉప కేంద్రాల మంజూరుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక కార్యచరణ చేపట్టినట్లు చెప్పారు. గిరిజన సంస్థ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ద్వారా రైతుల విద్యుత్ కనెక్షన్ల కోసం ఓఆర్సీ లేకుండా ఏడు కోట్ల రూపాయలను మంజూరు చేయించినట్లు చెప్పారు. 2000 మంది రైతులకు విద్యుత్ సౌకర్యం ఇప్పించినట్లు తెలిపారు.
అలాగే గృహ జ్యోతి పథకంలో 4,700 కుటుంబాలకు ఈ ప్రాంతంలో నెలకు 200 ఉచిత విద్యుత్తు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రైతులు నాణ్యమైన విద్యుత్తు పరికరాలను వినియోగించాలని, తప్పనిసరిగా ప్రతి ఇంట్లో ఎర్తింగ్ చేసుకోవాలని, గాలి దుమారం వచ్చినప్పుడు తెగిపడ్డ విద్యుత్ వైర్లను ముట్టుకోరాదని సూచించారు. విద్యుత్ ప్రమాదాలపై ట్రాన్స్కో ముద్రించిన ప్రచార పోస్టర్ ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ రాజు చౌహన్, ఎస్ఈ నరేష్, డీఈలు విజయ్, సునీత, కవిత, ఏడీఈ లు ఐలయ్య, ప్రణయ్, సురేష్, ఏ ఈలు రమణ, శ్రీధర్ పాల్గొన్నారు.