21-01-2026 12:01:29 AM
తాండూరు, జనవరి20 (విజయక్రాంతి): మా ఊరు వాడలను..మా పిల్ల పాపలను..మా పాడి పంటలను సల్లంగా చూడు ఊరడమ్మ తల్లో అంటూ వికారాబాద్ జిల్లా మంబాపూర్ లో మంగళవారం ఘనంగా గ్రామ దేవతకు గ్రామస్తులు పూజలు నిర్వహించారు. మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గత రెండు రోజుల నుండి గ్రామ దేవతకు పూజలు నిర్వహిస్తున్నారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా క్యూ కట్టారు. డప్పుల దరువులు, డోలు వాయిద్యాల మధ్య శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు కన్నుల పండుగగా సాగాయి. అమ్మవారి పసుపు కుంకుమ( బండారు) ప్రసాదం తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రధాన వీధుల గుండా కాషాయ తోరణాలు కట్టడంతో ఊరంతా కాషాయమయం అయింది .ఇంకా ఈ పూజ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు