01-10-2025 12:00:00 AM
చెన్నై, సెప్టెంబర్ 30: ‘ముఖ్యమంత్రి స్టాలిన్.. మీకు నాపై కక్ష ఉంటే, నాపై తీర్చుకోండి. నన్ను ఏదైనా చేయండి. నేను ఉంటే ఇంట్లో ఉంటాను. లేదంటే ఆఫీస్‌లో ఉం టాను. వచ్చి నన్ను ఏదైనా చేయండి. నాపై కక్షతో ప్రజల జోలికి మాత్రం వెళ్లకండి. నే నేం తప్పు చేయలేదు. మా నాయకులూ త ప్పు చేయలేదు మాపై అక్రమ కేసులు బనాయించారు. త్వరలోనే ప్రజలకు నిజానిజాలు తెలుస్తాయి’ అని టీవీకే చీఫ్ విజయ్ పేర్కొన్నారు.
తమిళనాడులోని కరూర్‌లో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాటపై మంగళవారం ఆయన ఓ వీడియో ద్వారా స్పందిం చారు. తన జీవితంలో ఇలాంటి చేదు అనుభవాన్ని ఎన్నడూ ఎదుర్కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవైపు తప్పు లేకపోయినా టీవీకే నాయకులు, సోషల్‌మీడియా బృందాలపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయ డంపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్నర్ మీటింగ్‌కు తనను చూసేందుకు వేలాది మంది తరలివచ్చారని, రాజకీయాలను పక్కనపెట్టి సురక్షిత ప్రాంతంలో సభ జరగాలని తాను కోరుకున్నానని తెలిపారు.
ప్రజల క్షేమం కోసం తాను పోలీసులతో చర్చలు జరిపానని, అయినప్పటికీ అనుకోని విషాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అంతకుముందు మొత్తం ఐదు జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిందని, ఎక్కడా జరగని తొక్కిసలాట ఒక్క కరూర్‌లోనే ఎందుకు జరిగిందని రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాస్తవానికి కరూర్‌లో ఏం జరిగిందో ప్రజలకు తెలుసునని, త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయని తెలిపారు.
త్వరలోనే తాను మృతులు, క్షతగాత్ర కుటుంబాలను కలుస్తానని, తాను పర్యటిస్తే అయా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయనే ఉద్దేశంతోనే తాను పర్యటిం చడం లేదని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయదని, మరింత బలం పుంజుకొని ముందుకు వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.
విజయ్ ఎప్పటికీ అలా చేయరు: టీవీకే
కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత టీవీకేపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ఏడాదిన్నరలో రెండు మహాసభలు, అనేక యాత్రలు చేపట్టిన అనుభవం ఉన్నా తొక్కిసలాట చోటుచేసుకోవడంపై తమిళనాడుకు చెందిన కొన్నివర్గాలు తిట్టిపోస్తున్నాయి. తాజాగా టీవీకే నేతలు కొందరు చేసిన పని ఆ పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నది. శ్రీలంక, నేపాల్‌లో జెన్‌జెడ్ నిరస నలు వచ్చి, అక్కడి ప్రభుత్వాల్ని యువత గద్దె దించినట్లే, తమిళనాడులోనూ జరగబోతున్నదని కొందరు నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.
దీంతో రాజకీయ ప్రత్యర్థులు, నెటిజన్లు టీవీకేపై ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. యువతను ఉసిగొల్పి హింసను ప్రేరేపించాలని చూస్తే సహించేది లేదని డీఎంకే ఎంపీ కనిమొళి ‘ఎక్స్’ ద్వారా హెచ్చరించారు. ఈ అంశంపై మంగళవాంర టీవీకే స్పందించింది. ఆ ప్రకటనలతో పార్టీ అధినేత విజయ్‌కిగానీ, పార్టీకి గానీ ఎలాంటి సంబంధం లేదని ‘ఎక్స్’ ద్వా రా స్పష్టం చేసింది. విజయ్ ఏనాడూ ప్రజలను రెచ్చగొట్టరని, హింసకు ప్రేరేపించే ప్రయత్నాలు చేయబోరని తెలిపింది.
యూట్యూబర్ అరెస్ట్.. మరో 25మందిపై కేసు
సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట ప్రమాదంపై నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న తమిళనాడు యూట్యూబర్ పెలిక్స్ జెరాల్డ్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్‌పిక్స్ పేరుతో యూట్యూబ్ చానల్ నిర్వహిస్తున్న జెరాల్డ్ తొక్కిసలాట ఘటనపై, టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రజలను రెచ్చగొట్టేలా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నందుకు మరో 25మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రజాశాంతికి భంగం కలిగించే, ఉద్రిక్తలను రేకెత్తించేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.