21-07-2025 12:00:00 AM
మంత్రి శ్రీధర్ బాబు
తిమ్మాపూర్ జూలై 20 యువత డ్రగ్స్ కు అలవాటు పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని వెంటనే పోలీసులు ప్రత్యేక దృష్టిని సారించి డ్రగ్స్ ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఆదివారం మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల అతిథి గృహంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా మండలంలోని పలు విద్యాసంస్థలలో గత కొంతకాలంగా డ్రగ్స్ చలామణి అవుతుందని దానిని అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆయన దృష్టికి తీసుకురావడంతో వెంటనే అక్కడే ఉన్న సిఐ సదన్ కుమార్,ను ప్రత్యేక చర్యలు చేపట్టి నిజనిర్ధారణ జరిగితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
మండలంలోని ఓ విద్యాసంస్థ హాస్టల్లో ఉంటున్న పలు విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకురావడంతో సంబంధిత వారిని పోలీస్ స్టేషన్ పిలిపించి వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.ఇటీవల ఓ మైనర్ బాలికను కళాశాలలో డ్రాప్ చేస్తానని బైక్ పై తీసుకువచ్చి ఎల్‌ఎండి శివారులో గల కాకతీయ కాలువ వద్ద లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాలని అలాంటి చెడు వ్యక్తి సమాజానికే బరువని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సీనియర్ నాయకుడు అబ్దుల్ సమద్, లతోపాటు పలువురు నాయకులుపాల్గొన్నారు.