గడ్డిపల్లి పాలిటెక్నిక్ కళాశాల ప్రతిభ చాటిన విద్యార్థులు
34 సీట్లకు 18 సీట్లు డాక్టర్ గంట గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థులదే..
గరిడేపల్లి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని ములుగులో ఉన్న కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. గడ్డిపల్లి పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న వివిధ ప్రాంతాలకు చెందిన 18 మంది విద్యార్థులు బిఎస్సి హార్టికల్చర్ కౌన్సిల్లో సీట్లు సాధించినట్లు కళాశాల సెక్రటరీ డాక్టర్ ఎం స్నేహలత బుధవారం విలేకరులకు తెలిపారు.
2025లో హార్టీ సెట్ ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులు మంగళవారం ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో జరిగిన కౌన్సిలింగ్ కి హాజరయ్యారు. ఈ కౌన్సిల్లో ప్రధమ, ద్వితీయ ర్యాంకుతో పాటు మొదటి పది ర్యాంకుల్లో ఏడు సీట్లను గడ్డిపల్లి పాలిటెక్నిక్ విద్యార్థులు సాధించారు. యూనివర్సిటీలో మొత్తం 34 సీట్లు ఉండగా 18 సీట్లు గడ్డిపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన విద్యార్థులు సాధించడం విశేషం అన్నారు. మొదటి ర్యాంకు నల్గొండ జిల్లా, పీఏపల్లి మండలం మాదాపురం గ్రామానికి చెందిన దాసరి హన్సిక ప్రధమ ర్యాంక్ సాధించగా, సూర్యాపేట పట్టణానికి చెందిన వెంపటి ఉన్మిత ద్వితీయ ర్యాంకు, నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామానికి చెందిన తురక చంద్రిక మూడవ ర్యాంకును సాధించిందని తెలిపారు. వీరితో పాటు మరో 15 మంది విద్యార్థులు కౌన్సిల్ ద్వారా సీట్లు సాధించారు.
కౌన్సిల్లో సీట్లు సాధించిన విద్యార్థులందరికీ హైదరాబాదులోని రాజేంద్రనగర్,వనపర్తి జిల్లాలోని మోజెర్ల,మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల లో ఉన్న ఉద్యాన కళాశాలలో సీట్లను కేటాయించినట్లు ఆమె వివరించారు.డాక్టర్ గంటా గోపాల్ రెడ్డి హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల లో చదివి అత్యధికంగా కౌన్సిల్ ద్వారా 18 సీట్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ కళాశాల చైర్మన్ డాక్టర్ ఎం నర్సింహారెడ్డి,డైరెక్టర్లు,ప్రిన్సిపల్,కళాశాల సిబ్బంది అభినందించారు.






