అక్రమంగా ఇసుక తరలిస్తున్న టాటా మ్యాజిక్ పట్టివేత
బోధన్, ఆగస్టు 13 (విజయ క్రాంతి):సాలూర మండలంలోని ఖాజాపూర్ గ్రామం వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఖాజాపూర్ పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారం మేరకు ఆర్‌ఐ శంకర్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టాటా మ్యాజిక్ వాహనం అధికారుల కంటపడటంతో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం వాహనాన్ని సీజ్ చేసి సాలూర మండల తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై నిరంతరం నిఘా ఉంచి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఖాజాపూర్ పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు పేర్కొన్నారు.






