కరెంట్ ఉచ్చులపై కొరడా
విద్యుత్ శాఖ అధికారులకు నోటీసులు.. రైతులకూ నోటీసులు
వన్యప్రాణుల వేటకు కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు గుర్తింపు
బూర్గంపాడు,ఆగస్టు13,(విజయక్రాంతి): కరెంట్ ఉచ్చుకు బీట్ ఆఫీసర్ నవీన్ మృతి చెందిన ఘటనపై అటవీశాఖ ఉన్నతాధికారులు సీరియస్గా స్పందించారు. బూర్గంపాడు మండలం చెరువు సింగారం వెస్ట్ బీట్లో నవీన్ మృతి చెందిన ప్రాంతాన్ని జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌ఓ) సిద్ధార్థ విక్రమ్సింగ్ గురువారం పరిశీలించారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, విద్యుత్ లైన్ల ఏర్పాటు, కరెంట్ ఉచ్చులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనుమతులపై ఆరా..
అటవీశాఖ అనుమతి లేకుండా విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించిన డీఎఫ్‌ఓ.. వాటికి సంబంధించిన వివరాలపై ఆరా తీశారు. అడవి జంతువుల వేట కోసమే కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. దీనిపై విద్యుత్శాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తామని వెల్లడించారు. కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసిన ప్రాంతం చుట్టుపక్కల ఉన్న రైతులకు కూడా నోటీసులు జారీ చేస్తామని డీఎఫ్‌ఓ తెలిపారు.
విద్యుత్ లైన్ల ఏర్పాటు, వినియోగం, కరెంట్ ఉచ్చులతో సంబంధం ఉన్న అంశాలపై రైతులను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తామని చెప్పారు. ఘటనకు బాధ్యులెవరనే దానిపై విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో అక్రమంగా కరెంట్ ఉచ్చులు ఏర్పాటు చేసి వన్యప్రాణుల వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఎఫ్‌ఓ హెచ్చరించారు. అటవీ సిబ్బంది ప్రాణాలకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. కిందిస్థాయి అటవీ సిబ్బంది రక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.






