14 August, 2026 | 1:29 AM

మోడికి ట్రంప్ ఫోబియా

14-08-2026 12:00 AM

కమ్యూనిస్టులతో మార్పు తథ్యం : సీపీఐ నేత కూనంనేని

ఖమ్మం/విజయక్రాంతి: సువిశాల భారతదేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడి పిరికివాడిగా మారిపోయాడని, ఆయనకు ట్రంప్ ఫోబియా పట్టుకుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. 145 కోట్ల జనాభా గలిగిన దేశానికి ప్రధానిగా ఉన్న అల్పసంఖ్యాకులైన సంపన్నులు కార్పోరేట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారన్నారు. సిపిఐ జన చైతన్య యాత్రల ముగింపు సందర్భంగా గురువారం ఖమ్మం నగరంలో పాదయాత్ర నిర్వహించారు.

పాదయాత్రల అనంతరం ఖమ్మం జడ్పీ సెంటర్ నుంచి పాత బస్టాండ్, మయూరి సెంటర్ మీదుగా భక్తరామదాసు కళాక్షేత్రం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. వందలాది పార్టీ కార్యకర్తలు, కళాకారుల ప్రదర్శనతో వైరా రోడ్ అరుణావర్ణం పులుముకుంది. భక్తరామదాసు కళాక్షేత్రంలో సిపిఐ జిల్లా కార్యదర్శి దండి  సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సభలో సాంబశివరావు మాట్లాడుతూ ప్రజలు  అనుభవిస్తున్న హక్కులు, సంక్షేమ పథకాలు కమ్యూనిస్టు పోరాట ఫలితంగా వచ్చాయని, ఇప్పుడు దేశంలో మార్పు సైతం, కమ్యూనిస్టుల ద్వారానే సాధ్యమవుతుందని ఇది తథ్యమని అన్నారు.   

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో తాత్సారం ప్రదర్శిస్తుందని, హామీలను విస్మరిస్తే ఆందోళన తప్పదని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. సన్నబియ్యం, ఉచిత బస్సు మినహా మిగిలిన హామీలలో ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు చేయలేదని ఆయన ఆరోపించారు. సిపిఐ ప్రజాచైతన్య యాత్రతో హేమంతరావు మాట్లాడుతూ అప్పుల పేరుతో హామీలను అమలు చేయకపోతే ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు.   

సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమీషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా తదితరులు ప్రసంగించగా, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి ఆహ్వానితులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సభలో సిపిఐ నగర కార్యదర్శి షేక్ జానీమియా, రాష్ట్ర సమితి సభ్యులు ఏపూరి లతాదేవి, కొండపర్తి గోవిందరావు, సిద్దినేని కర్ణకుమార్, మహ్మద్ సలాం, బిజి క్లైమెంట్, అజ్మీరా రామమూర్తి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ప్రజానాట్యమండలి, కళాకారులు సతీష్ బృందం అలపించిన గేయాలు సభికులను ఆకట్టుకున్నాయి.